ఈ పెంపుతో రూ. 4,016కు పెరిగిన పెన్షన్
మంచిర్యాల సభలో దివ్యాంగుల పింఛన్‌ను పెంచబోతున్నట్లు సిఎం కెసిఆర్ ప్రకటన
సంబంధిత ఫైల్‌ను ఆమోదించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సిఎం కెసిఆర్
హైదరాబాద్ : దేశానికే ఆదర్శంగా మానవీయకోణంలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పాలనలో తెలంగాణ రాష్ట్రం మరో చారిత్రక ఘట్టానికి వేదికగా నిలచింది.ఆసరా అవసరమైన దివ్యాంగులకు నేనున్నానంటూ ఆర్థిక భరోసాగా అందిస్తున్న మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం మరింతగా పెంచింది. ఈ మేరకు దివ్యాంగుల పింఛన్ ను రూ. 1,000 పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నెలా రూ. 3,016 పెన్షన్‌ను అందుకుంటున్న దివ్యాంగులు, ఈ పెంపుతో రూ. 4,016 పెన్షన్‌ను అందుకోబోతున్నారు. మంచిర్యాల సభ వేదికగా దివ్యాంగుల పింఛన్‌ను పెంచబోతున్నట్లు ప్రకటించిన సిఎం కెసిఆర్, సంబంధిత ఫైల్‌ను ఆమోదించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. అత్యధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. దివ్యాంగుల పింఛన్‌ను పెంచుతూ ఉత్వర్వులు వెలువడిన సందర్భంగా శనివారం మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు పుష్పగుచ్ఛం అందించి ధన్యవాదాలు తెలిపారు.
7.50 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం
రాష్ట్రంలో పెరిగిన డైట్ చార్జీల ద్వారా… ట్రైబల్ వెల్పేర్, ఎస్సీ వెల్పేర్, బిసి వెల్పేర్ గురుకులాలు, విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాలు తదితర మొత్తం గురుకులాల్లోని దాదాపు 7 లక్షల 50 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. ప్రస్తుతం అందిస్తున్న చార్జీలకు అదనంగా 26 శాతం చార్జీలు పెరిగాయని పేర్కొన్నారు. దీనితో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి దాదాపు మరో 237.24 కోట్ల రూపాయల మేరకు అదనపు భారం పడనున్నదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై పడే అదనపు భారాన్ని లెక్కచేయకుండా రాష్ట్రంలో విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థుల కోసం సన్నబియ్యంతో అన్నం పెడుతూ వారికి నాణ్యమైన విద్యతో పాటు చక్కటి భోజనాన్ని కూడా ఇప్పటికే అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు మరింత గొప్పగా భోజన వసతులను కల్పించుదుకు అందుకు అనుగుణంగా చార్జీలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని సిఎం స్పష్టం చేశారు.
సిఎంకు కృతజ్ఞతలు తెలిపిన దివ్యాంగులు
దివ్యాంగులకు ఫించన్ పెంచిన సందర్భంగా రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ కె. వాసుదేవ రెడ్డి, ఇతర వికలాంగుల సంఘాల నేతలు శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి కృతజ్జతలు తెలిపారు.