Saturday, November 16, 2024

రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య విస్తరణ

- Advertisement -
- Advertisement -

2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుండి నేటి వరకు ఈ తొమ్మిదేళ్లలో మన రాష్ట్రం లో ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సదుపాయాలు విస్తరిస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు వైద్య సదుపాయాలు, ఆసుపత్రుల నిర్మాణాలు, సరికొత్త వైద్య, ఆరోగ్య విధానాలు, పథకాలు ఈ వైద్య సదుపాయాల విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దాని ఫలితంగా నేడు అన్ని ఆరోగ్య సూచికల్లో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయి కంటే మెరుగ్గా ఉంది. గత ఏడాది “నీతి ఆయోగ్ విడుదల చేసిన నాల్గవ ఆరోగ్య సూచిల్లో తెలంగాణ రాష్ట్రం కేరళ, తమిళనాడు తర్వాత 3వ స్థానానికి చేరింది. తలసరి ప్రభుత్వం చేస్తున్న వైద్యఖర్చుల్లో రూ.1,698 లతో హిమాచల్ ప్రదేశ్, కేరళ తర్వాత మన తెలంగాణ రాష్ట్రం నిలిచింది, 2022-23 బడ్జెట్‌లో దానిని రూ. 3,091 లకు పెంచారు. సెంట్రల్ ఎకనామిక్ సర్వే 2022- 2023 ప్రకారం దక్షిణ భారత దేశంలో ప్రజారోగ్యంపై ప్రభుత్వ వ్యయంలో అత్యధిక వాటా కలిగిన రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో ఉంది. అలాగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన హెల్త్ ఫిట్నేషన్ కాంపెయిన్‌లో 3 కేటగిరిల్లో అవార్డులు ప్రకటించగా తెలంగాణ రాష్ట్రం 3 అవార్డులు సాధించి అగ్రస్థానంలో నిలిచింది.

వైద్య సదుపాయల విస్తరణ, నిరంతర మానిటరింగ్‌తో పాటు దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని అమలుచేస్తున్న కుటుంబ సంక్షేమ పథకాలలైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కె.సి.ఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి, అమ్మఒడి పథకాల సమ్మిళిత ఫలితాలే జాతీయ స్థాయిలో తెలంగాణ సాధించిన ఆరోగ్య సూచికలుగా పేర్కొనవచ్చు.అయితే వైద్యసేవలు గురించి ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విస్తరించిన సదుపాయాలు ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్యసేవలు అని స్పష్టంగా పేర్కొనవచ్చు. 2022లో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య, వైద్య శాఖ అభివృద్ధికి 11,440 కోట్ల రూపాయలను కేటాయించి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. జాతీయ వైద్య, ఆరోగ్య శాఖ ఇటీవలి గణాంకాల ప్రకారం గంటకు 28 ప్రసవాలతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ప్రభుత్వాసుపత్రులతో పోలిస్తే ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్ ప్రసవాల శాతం ఎక్కువ. తెలంగాణలో 57 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారానే జరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో సిజేరియన్ ప్రసవాల శాతం 21% ఉండగా భారత దేశంలో 22% ఉంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 నాటికి 28.5% సిజేరియన్ ప్రసవాలు జరుగుతాయని అంచనా వేసింది. కానీ ప్రస్తుతం తెలంగాణలో ఈ శాతం రెట్టింపు స్థాయిలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటళ్లల్లో సిజేరియన్ కాన్పులు పెరిగాయి. 2020-21లో 46.3 శాతం సిజేరియన్లు జరగగా, ఆ తర్వాతి ఏడాది 47.13 శాతం ఆపరేషన్లు జరిగాయి. అలాగే, ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్లు 65.34 శాతం నుంచి 61.08 శాతానికి తగ్గాయి, ప్రైవేటు ఆస్పత్రుల్లో కాస్త తగ్గినా సర్కారు ఆస్పత్రులతో పోలిస్తే అధికంగానే సిజేరియన్లు జరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల విడుదల చేసిన హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్‌ఎంఐఎస్) నివేదికలో ఈ విషయం వెల్లడైంది. తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు కూడా కార్పొరేట్ స్థాయి అత్యాధునిక వైద్యం అందుబాటులోకి తెచ్చుటకు ప్రాథమిక స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పించడం జరిగింది. గతంలో మూడు అంచెల ప్రాథమిక సేవలకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, ద్వితీయ స్థాయి సేవలకు జిల్లా ఆసుపత్రులు, స్పెషలిటీ సేవలకు మెడికల్ కాలేజీలుగా ఉన్న వైద్య సేవలు వ్యవస్థకు అదనంగా ప్రివేంటివ్ సేవలకు బస్తీ /పల్లె దావాఖానలు, సూపర్ స్పెషలిటీ వైద్య సేవలకు టిమ్స్‌లతో 5 అంచెలు వ్యవస్థగా మార్చి ప్రజల ముంగిటకే ప్రాథమిక వైద్యాన్ని, పేదలకు అందుబాటులోకి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను తెచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కింది. గతంలో క్షేత్ర స్థాయిలో వ్యాధులను గుర్తించే ప్రివేంటివ్ సేవలు అందించే వ్యవస్థ లేదు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఆధునిక వైద్య సేవలు, రోగ నిర్దారణ పరికరాలతో పాటు ఐసియు బెడ్స్‌ను అందుబాటులోకి తేవడం జరిగింది. అలాగే వైద్య భోదన కళాశాలల్లో ఐసియు బెడ్స్‌ను ఏర్పాటు చేశారు. దేశంలోనే మొదటిసారి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో రోగనిర్దారణ పరీక్షా కేంద్రాలను నెలకొల్పిన ప్రభుత్వం, వాటి నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నది. గాంధీ ఆసుపత్రిలో అత్యాధునిక సెంట్రల్ డయాగ్నస్టిక్ లేబరేటరీని ఏర్పాటు చేశారు. మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పిన ప్రభుత్వ డయాగ్నస్టిక్ కేంద్రాలలో జరుగుతున్న రోగ నిర్దారణ పరీక్షలను మానిటరింగ్ చేస్తున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్థుల సౌలభ్యం కొరకు 42 డయాలసిస్ కేంద్రాలను ప్రభుత్వం నెలకొల్పింది.

అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా నిర్వహించిన రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమం కింద 1 కోటి అరవై లక్షల మందికి కంటి పరీక్షలు చేసి దృష్టి లోపం ఉన్న వారికి ఉచితంగా కళ్లద్దాలు, మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ వైద్యంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు వేలాది రూపాయలు ఆదా అవుతున్నాయి. రాష్ట్ర ప్రజలు వైద్య అవసరాలను నెరవేర్చే సంకల్పంతో వైద్య, విద్య విస్తరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. అందులో భాగంగా వరంగల్ లో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వం నెలకొల్పింది. తెలంగాణ ఏర్పడిన 2014 నాటికి తెలంగాణలో ప్రభుత్వపరంగా 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు మొదటి దశలో ఒక్కొక్కటి రూ.450 కోట్ల వ్యయంతో కొత్తగా మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట లలో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలు నడుస్తున్నాయి. సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, రామగుండంలో ఎనిమిది కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 1200 మెడికల్ సీట్లను అందిస్తున్నాయి ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలల అభివృద్ధికి రూ. 4080 కోట్లు ఖర్చు చేసింది. ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది, మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య ప్రవేశాల సీట్లు కూడా పెరిగాయి, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కొత్త మెడికల్ కళాశాలల కోసం 34 స్పెషలైజేషన్లలో 1,061 సహాయ ఆచార్యులు కేవలం ఐదు నెలల్లో నియమించారు. అలాగే వివిధ వైద్య, ఆరోగ్య శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయటానికి 12,522 పోస్టులకు అనుమతులు తీసుకొని, 5200 స్టాఫ్ నర్స్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.

ఉత్తర తెలంగాణ జిల్లాలకు తలమానికంగా ఉన్న వరంగల్‌ను హెల్త్ సిటీగా అభివృద్ధి చేయుటకు 2,000 పడకల సామర్ధ్యంతో రూ. 1,100 కోట్లతో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఇ.ఎన్.టి డెర్మటాలాజీ, ఆర్దోపిడిక్స్, ఆంకాలజీ, న్యూరాలాజీ, న్యూరో సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, గ్యాస్త్రో ఎంటరాలాజీ, కార్డియాలజీ, యురాలాజీ, నెఫ్రాలజీ వంటి 35 రకాలు 24 అంతస్తుల తెలంగాణలోని అతి పెద్ద సూపర్ స్పెషలిటీ విభాగాలతో మల్టీ సూపర్ స్పెషలిటీ ఆసుపత్రిని ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఈ ఆసుపత్రిలో అత్యాధునిక క్యాన్సర్ సెంటర్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు, దీనితో వరంగల్ ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందుబాటులో వస్తాయి. పట్టణ పేదలకు నాణ్యమైన ప్రభుత్వ వైద్య సేవలను అందించే లక్ష్యంతో గ్రేటర్ హైదరాబాద్‌లో 256 బస్తీ దవాఖానలను ప్రభుత్వం నెలకొల్పింది. వీటి స్ఫూర్తితో 141 మున్సిపాలిటీలలో కొత్తగా 288 బస్తీ దవాఖానలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. వ్యాధుల నిర్ధారణలో జరుగుతున్న దోపిడీని అరికట్టుటకు 57 రకాల రోగానిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేయుటకు తెలంగాణ డయాగ్నస్టిక్స్ ల్యాబ్‌ను ప్రభుత్వం నెలకొల్పి, ప్రభుత్వ ఆసుపత్రులను అనుసంధానం చేసింది. ప్రాథమిక స్థాయిలో మరింత మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 4,745 సబ్ సెంటర్లను “పల్లె దవాఖాన”లుగా అభివృద్ధి చేయుటకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.

అమ్మఒడి పథకం ద్వారా గర్భిణిలు ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్ళడం కోసం, ప్రసవానంతరం ఇంటికి చేరడం కోసం ప్రభుత్వం ప్రత్యేక వాహన సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. ఇందు కోసం దాదాపు 250 వాహనాలు పని చేస్తున్నాయి. సురక్షితమైన ప్రసవాల కోసం ప్రభుత్వ ఆస్పత్రులలో చేరే వారికి ప్రభుత్వం కెసిఆర్ కిట్లు అందిస్తుంది. 2022 జనవరి 17 నాటికి కెసిఆర్ కిట్స్ పథకం ద్వారా లబ్ధి పొందిన గృహిణుల సంఖ్య 10 లక్షలు దాటింది. ఈ పథకం ద్వారా గర్భిణులకు ఆర్థికసాయం అందించడంతోపాటు సామాజికంగా అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో అందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించుటకు చేస్తున్న కృషి మంచి ఫలితాలనుఇస్తుంది. అదే స్ఫూర్తితో ఆరోగ్య కుటుంబ సంక్షేమ పథకాలు అమలులో ముందున్న రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా రూపుదిద్దుకుంటున్నది. వైద్య సదుపాయాలు మారుమూల పల్లెలకు, గిరిజనులకీ అందిచేలా మరిన్ని నిధులని కేటాయించి ఆరోగ్య రంగంపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని, ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరుకుందాం.

డా. కందగట్ల శ్రవణ్ కుమార్,  8639374879

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News