Friday, November 22, 2024

వక్ఫ్ భూములు యధేచ్ఛగా అన్యాక్రాంతం !

- Advertisement -
- Advertisement -
77,538.07 ఎకరాలకు గాను 57,423.91 ఎకరాల భూమి కబ్జా
పలుచోట్ల కబ్జాదారులకు నోటీసులు
సిఎం కెసిఆర్ ఆదేశంతో రంగంలోకి అధికారులు
ప్రభుత్వానికి నివేదిక అందజేత

హైదరాబాద్ : చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో వక్ఫ్ భూములు యధేచ్ఛగా అన్యాక్రాంతమయ్యాయి. వక్ఫ్ భూముల వ్యవహారంపై సిబిసిఐడి విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం సిఐడి విచారణలో పలు విస్తుగొలిపే అంశాలు బయటకు వచ్చాయి. ఇప్పటికే వక్ఫ్‌బోర్డుకు సంబంధించి 75 శాతం భూములు కబ్జాకు గురయ్యాయని అధికారులు తేల్చారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. చాలా జిల్లాలో స్థానికంగా ఉండే నాయకులే వాటిని కబ్జా చేసి విక్రయించినట్టుగా సిఐడి గుర్తించింది. వక్ఫ్‌బోర్డు భూములకు సంబంధించి దర్గా, గ్రేవ్‌యార్డ్, మసీదు, అషూర్‌కానా, ఛిల్లాస్, టకీయాస్ లాంటివన్నీ కలిపి మొత్తం 33,929 సంస్థలున్నాయి. వీటి పరిధిలో మొత్తం 77,538.07 ఎకరాల వక్ఫ్‌భూమి ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. అయితే ఇందులో వక్ఫ్‌బోర్డు ప్రాథమిక సర్వే ప్రకారం ఇందులో 6,938 మంది కబ్జాదారులు 57,423.91 ఎకరాల భూమిని కాజేశారు. రంగారెడ్డి, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోనే 54 వేల పైచిలుకు భూములు అన్యాక్రాంతమైనట్టు సిఐడి గుర్తించింది.

వక్ఫ్ భూముల అన్యాక్రాంతాన్ని సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం కబ్జారాయుళ్ల చెర నుంచి వందల ఎకరాలను విడిపించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే కబ్జారాయుళ్లకు నోటీసులు జారీ చేసింది. దీంతోపాటు 4,186 చోట్ల అక్రమ నిర్మాణాలను తొలగించింది. దీంతోపాటు అన్యాక్రాంతాలకు సంబంధించిన 2,892 కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉండగా వాటిని పరిష్కరించడానికి 9 మంది న్యాయవాదులతో ప్రత్యేక బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. వక్ఫ్‌భూముల పరిరక్షణకు శాత్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ సీబిసీఐడి విచారణకు ఆదేశించడంతో, రాష్ట్రంలో మొత్తం వక్ఫ్‌భూముల స్థితిగతులు ఎలా ఉన్నాయి? మొత్తం భూమి ఎంత? అన్యాక్రాంతమయ్యింది ఎంత? కబ్జాదారులు ఎవరు? కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులెన్ని? వాటి ప్రస్తుత స్థితిగతులు ఏమిటి? తదితర వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
వక్ఫ్‌బోర్డు పరిధిలో ఉన్న సంస్థలు సంస్థ పేరు సంఖ్య
దర్గాలు 1,869
గ్రేవ్‌యార్డ్ 8,521
మసీదులు 3,052
అషూర్‌ఖానాస్ 1,1056
ఛిల్లాస్ 6,789
ఠకియాస్ 112
ఇతరులు 2,530
ఉమ్మడి జిల్లాలో భారీ కబ్జాలు
ముఖ్యంగా ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్ జిల్లాలో భారీస్థాయిలో కబ్జాలున్నట్లు సిఐడి ప్రాథమిక పరిశీలనలో గుర్తించింది.

వక్ప్‌బోర్డుకు ప్రభుత్వం గతంలో ఇచ్చిన భూముల వివరాలు ఇలా ఉన్నాయి:

ఉమ్మడి జిల్లా       స్థలాల సంఖ్య       రికార్డుల్లో ఉన్న భూములు        ఆక్రమణలో ఉన్నవి (ఎకరాల్లో)
ఆదిలాబాద్         1734               10119.33                      9189.12
హైదరాబాద్         2706               1785.17                       1426.28
కరీంనగర్           1971               1846.26                           60.03
ఖమ్మం             1174                 534.10                         143.31
మహబూబ్‌నగర్    4561              11500.18                       7864.38
మెదక్              6325               23910.11                    23782.03
నల్లగొండ           3108                 5300.31                      1400.02
నిజామాబాద్       3597                 4795.25                          23.12
రంగారెడ్డి            5724               14785.17                    13480.25
వరంగల్            3029                 2962.19                          12.37
మొత్తం           33,929             77,538.07                    57,423.91

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News