ఆగస్టు 16 నుంచి టిడిపి బస్సు యాత్ర : కాసాని వెల్లడి
హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో తెదేపా 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని టీ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. రాష్ట్రం లోని అన్ని జిల్లాల్లో పార్టీ జెండాలు ఉన్నాయని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పాటు తాము పోటీచేస్తున్నామన్నారు. ఈ మేరకు ఆదివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని టీ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పార్టీ జెండా ఎగురవేసి ప్రారంభించారు.
ఈ మేరకు నియోజకవర్గ ఇంచార్జ్ గా నియమితులైన ఎడ్ల మల్లేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ ఆగస్టు 15న జాతీయ జెండా ఎగరేసి 16న బస్సు యాత్ర కార్యక్రమం చేపట్టేందుకు కసరత్తు జరుగుతున్నట్లు కాసాని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మంద మల్లమ్మ చౌరస్తా నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు నాయకులు పాల్గొని ర్యాలీగా జిల్లెలగూడ చెరువు సమీపంలో ఉన్న అమర వీరుల స్తూపం వద్ద నివాళి అర్పించి మీర్పేట్ డివిజన్ నుంచి బాలాపూర్ చౌరస్తా వరకు పాదయాత్రను నిర్వహించారు. కార్పోరేటర్ గా గెలిచిన ఎడ్ల మల్లేష్ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరి ఇంచార్జిగా నియామకం అయిన వెంటనే ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం మంచి శుభపరినామం అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జాతీయ కార్యదర్శి కాసాని విరేష్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీలు మేకల బిక్షపతి ముదిరాజ్, పెద్దోజు రవీంద్ర చారి, ప్రకాశ్ ముదిరాజ్, రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు చంద్రహాస్, హైదరాబాద్ నగర, స్థానిక మహేశ్వరం నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.