ప్రజా రవాణా సౌకర్యానికి ఎట్టి పరిస్థితుల్లో ఆటంకం కలగకూడదు
అధికారుల సమీక్షలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
హైదరాబాద్ : దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని, ప్రజా రవాణా సౌకర్యానికి ఎట్టి పరిస్థితుల్లో ఆటంకం కలగకూడదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అధిక వర్షాలు, వరదల వల్ల పాడైన ఆర్ అండ్ బి శాఖ పరిధిలోని రోడ్ల మరమ్మతులకు సంబంధించి రోడ్లు, భవనాల శాఖ అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సెక్రటేరియట్‌లోని తన చాంబర్‌లో సోమవారం సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ యుద్ధప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. డీఈ నుంచి ఆపై స్థాయి అధికారికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను అందుబాటులో ఉంచిందని, స్థానిక పరిస్థితులకు అనగుణంగా తక్షణ మరమ్మతుల కోసం ఈ నిధులను వెచ్చించాలని ఆయన సూచించారు. ప్రజల రవాణా సౌకర్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకం కలగకూడదని మంత్రి ఈ సందర్భంగా అధికారులకు స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో ఉన్న అధికారికి సైతం పరిపాలన అనుమతుల అధికారం కల్పిస్తూ సిఎం కెసిఆర్ ఆర్ అండ్ బి శాఖ పునర్వ్యస్థీకరణలో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని మంత్రి గుర్తు చేశారు. డీఈకి రూ. 2లక్షలు,ఈఈ రూ.25 లక్షలు, ఎస్‌ఈకి రూ. 50 లక్షలు, సిఈ కోటి, ఈఎన్సీకి రూ.20 కోట్ల వరకు నిధులను రోడ్ల తక్షణ మరమ్మతుల కోసం వినియోగించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బి సెక్రటరీ శ్రీనివాస రాజు, ఈఎన్సీ రవీందర్ రావు, సిఈ లు సతీష్, మోహన్ నాయక్, ఎస్‌ఈలు మోహన్, శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.