లండన్ : అణుబాంబు పితామహుడుగా పేరొందిన అమెరికా సైంటిస్టు రాబర్ట్ జె ఓపెన్‌హైమెర్‌కు అప్పటి భారత ప్రధాని నెహ్రూ ఓ రహస్య లేఖ పంపించారనే విషయం వివాదాస్పదమైంది. అణుబాంబు తయారీతో ప్రపంచ విధ్వంస కారకుడుగా అపఖ్యాతి తెచ్చుకున్న ఓపెన్‌హైమర్‌కు నెహ్రూ ఏం లేఖ రాశారు? ఇందులో ఏముందనేది ఇప్పుడు తాజాగా వచ్చిన హాలివుడ్ సినిమాతో చర్చకు దారితీసింది. అప్పట్లో అణుబాంబు నిర్మాతను ఇండియాకు వలసరావల్సిందిగా ఆహ్వానం అందిందని భారతీయ అణుశాస్త్రవేత్త
హోమి జెహంగీర్ బాబా జీవితకథను రాసిన భక్తియార్ కె ధడభాయ్ తమ 723 పేజీల పుస్తకంలో తెలిపారు.హోమిజె బాబాకు ఓపెన్‌హెమర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా వివరించారు. అమెరికా సైంటిస్టుకు సంస్కృతం బాగా వచ్చునని, లాటిన్, గ్రీక్‌లు కూడా తెలుసునని, భారతదేశం పట్ల ఆయనకు బాగా ఆసక్తి ఉండేదని , ఈ దశలోనే ఈ వివాదాస్పద సైంటిస్టుకు నెహ్రూ లేఖ రాయడం, ఇందులో ఉన్న విషయాల గోప్యతపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
శృంగార సన్నివేశంలో భగవద్గీత రగడ
శుక్రవారం విడుదల అయిన క్రిస్టోఫర్ నోలస్ దర్శకత్వపు సినిమా ఓపెన్ హైమర్‌లో ఓ శృంగార ఘట్టం నేపథ్యంలో భగవద్గీత పుస్తకం ఉంది. దీనిని వెంటనే తొలిగించాలని భారత కేంద్ర సమాచార శాఖ కమిషనర్ ఉదయ్ మహూర్కర్ డిమాండ్ చేశారు. లేకపోతే తగు విధంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విషయం తెలిసి స్పందించారు. భగవద్గీత భారతీయలకే కాకుండా ప్రపంచవ్యాప్త ప్రజలకు పవిత్ర ఆదర్శ గ్రంథం అని, కామకేళి ఘట్టాల నడుమ దీనిని ప్రదర్శించడం అనుచితం అని పేర్కొని ఈ సీన్ కట్ చేయాల్సిందేనని మంత్రి తెలిపినట్లు వెల్లడైంది.