న్యూఢిల్లీ : పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందించాలంటూ దాఖలైన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. 6 నుంచి 12 వ తరగతి బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందించడంతోపాటు ప్రభుత్వ ఎయిడెడ్ , రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రత్యేక మరుగుదొడ్లు ఉండేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఆదేశించాలంటూ గతంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై మరోసారి జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. రుతుస్రావ పరిశుభ్రత నిర్వహణపై జాతీయ ఏకరీతి విధానాన్ని తీసుకురావాలని , ఈమేరకు రాష్ట్రాలతో చర్చలు జరపాలని గతంలో కోర్టు ఆదేశించింది.
ఈమేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సమన్వయమై జాతీయ విధానానికి అవసరమైన డేటాను సేకరించడానికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కార్యదర్శిని నోడల్ అధికారిగా సుప్రీం కోర్టు నియమించింది. అయితే కేంద్రానికి ఇప్పటివరకు సమాధానాలు ఇవ్వని రాష్ట్రాలను హెచ్చరించింది. ఇప్పటివరకు నాలుగు రాష్ట్రాలు మాత్రమే స్పందించాయని మిగతా రాష్ట్రాల నుంచి స్పందన లేదని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. అయితే ఆయా రాష్ట్రాలకు ఆగస్ట్ 31 వరకు సుప్రీం కోర్టు గడువు ఇచ్చింది. అప్పటికీ స్పందించకుంటే కఠిన చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. ఈమేరకు ఆయా రాష్ట్రాలకు నోటీస్లు ఇవ్వనున్నట్టు ధర్మాసనం పేర్కొంది.