Friday, December 20, 2024

బిజెపి ఎంపిలతోపాటు వంద మందిని వదిలేసిన పైలట్

- Advertisement -
- Advertisement -

రాజ్‌కోట్ : విమానయాన సంస్థ ఎయిరిండియా మరోసారి వార్తల్లో నిలిచింది. గుజరాత్ లోని రాజ్‌కోట్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని టేకాఫ్ చేసేందుకు పైలట్ నిరాకరించడంతో వందమంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. గుజరాత్ లోని రాజ్‌కోట్ విమానాశ్రయం లో ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.

ఆ సమయంలో ప్రయాణికుల్లో ముగ్గురు బీజేపీ ఎంపిలు కూడా ఉన్నారు. ఆదివారం రాత్రి 8.30 గంటల పమయంలో గుజరాత్ లోని రాజ్‌కోట్ విమానాశ్రయం నుంచి ఎయిరిండియా విమానాన్ని టేకాఫ్ చేసేందుకు పైలట్ నిరాకరించడానికి కారణాలు పరిశీలించగా, డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) నిబంధనల ప్రకారం తన పనిగంటలకు మించి పనిచేయడంతో విమానాన్ని టేకాఫ్ చేసేందుకు పైలట్ ససేమిరా అన్నారు. ఆ వందమంది ప్రయాణికుల్లో రాజ్‌కోట్ ఎంపీ మోహన్ కుందరియా, జామ్‌నగర్ ఎంపీ పూనమ్ మాదమ్, రాజ్యసభ ఎంపీ కేసరీదేవ్ సిన్హ్ ఝూలా ఉన్నారు. దాంతో విమానాశ్రయంలో గందరగోళ వాతావరణం నెలకొంది.

దీనిపై వచ్చిన విమర్శలకు ఎయిరిండియా వివరణ ఇచ్చింది. ఆపరేషనల్ కారణాల వల్ల విమానం ఆలస్యమైందని వివరించింది. “ నియంత్రణ సంస్థ నిబంధనల ప్రకారం , డ్యూటీ సమయం పరిమితులను దాటి వారు తమ విధులను నిర్వహించడం వీలుకాదు. ఆ విషయంలో ఎటువంటి రాజీ ఉండదు. అత్యవసరంగా గమ్యస్థానాలు చేరాల్సిన వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. మిగిలిన వారికి హోటల్‌లో సదుపాయాలు కల్పించాం. ఎవరైనా టికెట్ రద్దు చేసుకుంటే పూర్తి సొమ్మును వాపసు చేసుకునే వీలు కల్పించాం. ” అని ఎయిరిండియా తన ప్రకటనలో పేర్కొంది. గత నెల కూడా ఎయిరిండియా విమానంలో ఇదే విధమైన సంఘటన జరిగింది.

లండన్ నుంచి ఢిల్లీ బయలుదేరిన విమానం వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో రాజస్థాన్ లోని జైపూర్‌లో దిగింది. రెండు గంటల తరువాత ఢిల్లీకి వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ క్లియరెన్స్ ఇచ్చినా పైలట్ మాత్రం టేకాఫ్ చేసేందుకు నిరాకరించాడు. డ్యూటీ సమయం పరిమితులు, పనిగంటలు కారణంగా చూపి తాను విమానాన్ని నడపబోనని పట్టుబట్టాడు. దీంతో దాదాపు 350 మంది ప్రయాణికులు జైపూర్ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయారు. కొందరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని గమ్యస్థానాలకు చేరగా, మరికొంతమంది విమానాశ్రయం లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. చివరకు ప్రత్యామ్నాయ సిబ్బందిని ఏర్పాటు చేయడంతో కొన్ని గంటల తరువాత విమానం తిరిగి ఢిల్లీ చేరుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News