Sunday, December 22, 2024

24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందిస్తాం: భట్టి

- Advertisement -
- Advertisement -

ఉచిత కరెంటు తమ పాలసీ అంటూ సీఎం కెసిఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రతి సందర్బంలో పచ్చి అబద్దాలు మాట్లాడుతూ తెలంగాణ సమాజన్ని పక్కదోవ పట్టిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాలు, ఆగడాలను అరికట్టడానికి కాంగ్రెస్ పార్టీగా 60 సంవత్సరాలుగా తెలంగాణలో ఏం అభివృద్ధి చేశామో.. తెలంగాణ ప్రజలకు చెప్పడానికి సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడుతూ..”కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనుల ముందు సెల్ఫీ దిగి మేము చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తాం. ఉచిత విద్యుత్తు బిఆర్ఎస్ తెచ్చిందంటూ.. అంతకు ముందు లేదన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా పచ్చి అబద్ధాలు చెబుతూ రాష్ట్రాన్ని, దేశాన్ని మోసం చేస్తున్నారు. బిఆర్ఎస్ పాలకులు చెప్పినట్లుగా మాయమాటలు అబూత కల్పన కాంగ్రెస్ చెప్పట్లేదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఉచిత కరెంటు పై తొలి సంతకం చేశారు. ఆ రోజు చారిత్రాత్మకమైనది. ఉచిత కరెంటు ఫైల్ పై సంతకం చేసిన ఫోటోను మీడియా సమావేశంలో ప్రదర్శిస్తున్నాను.

జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఆలోచన చేయని రోజుల్లోనే పిసిసి అధ్యక్షుడిగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ మేనిఫెస్టో చైర్మన్ గా చక్రపాణి గారలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అనుమతితో ఉచిత విద్యుత్ అంశాన్ని 1999 సంవత్సరం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చారు. వ్యవసాయం నీటిపారుదల అనే అంశం కింద రైతులకు ఉచిత విద్యుత్తు, విద్యుత్ బకాయిల మాఫీ, విద్యుత్ కనెక్షన్ల కోసం పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నిటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల్లో పరిష్కారం, కొత్త దరఖాస్తులను 30 రోజులలో పరిష్కరిస్తాం. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను యంత్రాలను ప్రవేశపెట్టడం, యంత్రాల నిర్వహణలో రైతుకు తగిన శిక్షణ ఇవ్వడం, వారి పనిముట్లను మెరుగుపరచడం, భూసార పరీక్షలు నిర్వహించడం, పంట మార్పులపై ఎప్పటికప్పుడు సరైన సలహాలు ఇవ్వడం, మేలు రకం విత్తనాలు, పురుగు మందులు సమకూర్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం, కల్తీదారులను కఠినంగా శిక్షించడం తదితర అంశాలను అప్పటి మేనిఫెస్టోలో పొందుపరిచాము. ఆనాటి మేనిఫెస్టోని ఇప్పుడు చూపిస్తున్నాం.

ఉచిత కరెంటు అనేది 1999 నుంచి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ దీనిని కొనసాగిస్తాం. మేము 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టిన పవర్ ప్రాజెక్టు కంటిన్యూ చేయడం వల్లనే ఇప్పుడు విద్యుత్ కోతలు లేవన్న విషయం వాస్తవం. బిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి సొమ్ముతో ప్రచార ఆర్భాటం చేస్తూ.. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నది. తెలంగాణ సమాజాన్ని పక్కదోవ పట్టించే విధంగా తప్పుడు ప్రచారం చేయిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లకు బుద్ధి చెప్పాలి. సీఎం కేసీఆర్ కు సోయిందో లేదో తెలియదు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో అవసరాలు ఉంటాయి.

ఆ రాష్ట్ర అవసరాలు ఆదాయ వనరులను బట్టి మేనిఫెస్టో ఉంటుంది. ఉచిత కరెంటు చత్తీస్గఢ్లో ఎందుకు ఇవ్వడం లేదు అనడం పిచ్చి ముదిరి మాట్లాడినట్టుగా ఉంది అని విలేకరులు అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టిఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్తు పై సంతకం పెట్టిన ఫోటోను ప్రజలకు చూపెట్టాలని పిలుపునిస్తున్నా. హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు మేమే తెచ్చాం.. మెట్రో ఎక్కి సెల్ఫీ తీసి ఈ మెట్రో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిందని చూపెడతాం. మెట్రో చార్జీలు ఎందుకు పెంచారాని ప్రజల్లోకి వెళతాం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్, ఈసీఐఎల్, బిహెచ్ఇఎల్, బిడిఎల్ డ్రింకింగ్ వాటర్ ఇలా ప్రతి అభివృద్ధిని సెల్ఫీ విత్ కాంగ్రెస్ తో ప్రజల ముందుకు తీసుకు వెళతాం.సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్మెంట్ కార్యక్రమంలో తెలంగాణలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ కార్యక్రమం లో పాల్గొంటారు. వాట్సాప్ డిపి లో సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్మెంట్ ఫోటోలు పెట్టుకుని విసృత ప్రచారం చేయాలి” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News