హైదరాబాద్ : రాష్ట్రంలో మరుగున పడిన చరిత్రను వెలికితీస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి వి . శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ద్వారా సాహిత్య ,చారిత్రక, సాంస్కృతిక, కళాత్మక అంశాలు, శాసన పరిశోధన గ్రంథాలను సేకరించి ప్రచురణ చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో కాకతీయుల కాలంలో ఛందస్సు పరిశోధనపై ప్రముఖ రచయిత , చరిత్ర పరిశోధకులు డా. లగడపాటి సంగయ్య రూపొందించిన ‘కాకతీయుల శాసనాలలో చందో వైవిధ్యం’ అనే గ్రంధాన్ని ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పుస్తక రచయిత డా. లగడపాటి సంగయ్యను మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సత్కరించి అనంతరం మాట్లాడుతూ ఇలాంటి రచయితల ద్వారానే కాకతీయ శాసనాలలోని చందస్సును విశ్లేషించి భాషాపరంగా, పరిశోధన పరంగా శాసనాలలో ఛందో వైవిధ్యతపై పరిశోధనలు వస్తున్నాయన్నారు. అలాంటి చరిత్ర రచన, శాసన , భాషా శాస్త్రం లో కొత్త కోణాలను వెలికి తీయడం దేశ శాసన పరిశోధనలోనే తొలి ప్రయత్నమన్నారు. ఈ పరిశోధన గ్రంథంలో రచయిత..కాకతీయ కాలంనాటి 142 శాసనాలను అధ్యయనం చేసి 49 రకాల ఛందస్సును విశ్లేషించడం అరుదైన ప్రయత్నం చేశారన్నారు. ఈ గ్రంథంలో ఇంతవరకు చరిత్రకెక్కని కాకతీయ కాలంనాటి 7 గురు శాసన కవుల వివరాలను తొలిసారిగా ఈ గ్రంథంలో వెల్లడించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ, ప్రముఖ చరిత్ర పరిశోధకులు డా. ఈమని శివనాగిరెడ్డి పాల్గొన్నారు.
వాల్ పోస్టర్ ఆవిష్కరణ :
బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 373 వ జయంతిని పురస్కరించుకొని ఆగస్టు 13వ తేదీన హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్న జయంతి వారోత్సవాలపై రూపొందించిన వాల్ పోస్టర్‌ను కూడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జై గౌడ్ ఉద్యమం జాతీయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్, రాష్ట్ర గౌడ సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజు గౌడ్, అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కురేళ్ల వెములయ్య గౌడ్, జై గౌడ్ ఉద్యమం జాతీయ, తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.