మనతెలంగాణ/హైదరాబాద్ : హైకోర్టు ఆదేశాల మేరకు తనను కొత్తగూడెం ఎంఎల్‌ఎగా పరిగణించి ప్రమాణ స్వీకారం చేయించాలని అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శిని జలగం వెంకట్‌రావు కోరారు. వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను రద్దు చేస్తూ జలగం వెంకట్‌రావును ఎంఎల్‌ఎగా ప్రకటిస్తూ హైకోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పును బుధవారం అందచేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి ఆయన చాంబర్‌లో వివరాలు సమర్పించినట్లు జలగం వెంకట్‌రావు తెలిపారు. అసెంబ్లీ కార్యదర్శిని నేరుగా కలిసి ప్రమాణ స్వీకరణ ప్రక్రియ నిర్వహించాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హైకోర్టు తనను ఎంఎల్‌ఎగా పరిగణిసతూ, వనమా వెంకటేశ్వర రావును అనర్హుడిగా ప్రకటించందని తెలిపారు.
ఇది నైతిక విజయమని.. తీర్పును అమలు చేయాలని సెక్రటరీని కలిశానన్నారు. 2018 ఎన్నికల్లో అనేక కుతంత్రాలు చూశామని.. చివరికి తనదే విజయమని పేర్కొన్నారు. ఎంఎల్‌ఎగా మూడు నెలల్లో కొత్తగూడెంకు ఏం చేయాలో తనకు ఎజెండా ఉందని చెప్పారు. ఖమ్మం జిల్లాలో 2014లో బిఆర్‌ఎస్ నుంచి తాను ఒక్కడినే గెలిచానని జలగం వెంకట్‌రావు స్పష్టం చేశారు. రాజకీయ కుతంత్రాల వల్ల 2018లో ఓడిపోయినప్పటికీ, బిఆర్‌ఎస్‌లోనే ఉన్నానని తెలిపారు. భవిష్యత్తులోనూ సిఎం కెసిఆర్ నాయకత్వంలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు అనంతరం బిఆర్‌ఎస్ అధిష్టానంతో చర్చించినట్లు ఆయన వివరించారు. తప్పుడు వివరాలతో వాస్తవాలను దాచిపెట్టి ఎన్నికల అఫిడవిట్ ఇచ్చినందుకు వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను రద్దు చేసి ఆయనకు రూ.5లక్షల జరిమానాను హైకోర్డు విధించిన సంగతి తెలిసిందే.
సుప్రీంకు వెళ్లే వరకూ తీర్పు అమలు నిలిపివేయండి:- హైకోర్టులో వనమా పిటిషన్
తన అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు అప్పీల్‌కు వెళ్లడానికి అవకాశం ఇవ్వాలని కోరుతూ కొత్తగూడెం ఎంఎల్‌ఎ వనమా వెంకటేశ్వర రావు హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం వనమా వెంకటేశ్వరరావు తరపు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తే వనమా వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. పదవి కాలంలో మరో నాలుగు నెలలు మాత్రమే ఉండటంతో సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణ పూర్తయ్యే సరికి పదవి కాలం పూర్తయిపోతుంది.