హైదరాబాద్ ః రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అప్రమత్తత, సన్నద్ధత పై ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇంజినీర్లు, అధికారులతో గురువారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల వారీగా పరిస్థితులపై ప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్త పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అత్యవసర, అవసరమైన ఆదేశాల జారీ చేస్తున్నారని, వాటిని అనుసరిస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని పేర్కొన్నారు. జిల్లాలో నియోజకవర్గ మండలాల ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని చెప్పారు.
లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రాజెక్టులు, చెరువులు పరిస్థితి ఎప్పటికప్పుడు పరిశీలించాలని మంత్రి సూచించారు. వరద, వర్షం నీటికి రహదార్లు దెబ్బతినడంతో ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుందని, అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఉమ్మడి జిల్లాలోని పట్టణాల్లో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, వరద ప్రవాహంతో ఇబ్బంది ఉండకుండా చూసుకోవాలని ఆదేశించారు. నిరంతర వానలకు గోడలు బాగా తడిచి ఉంటాయని, శిథిలావస్థలో ఉన్న ఇళ్ల నుంచి ప్రజల్ని తరలించి తాత్కాలిక క్యాంపులు, రిహాబిలిటేషన్- పునరావాస చర్యలు ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగానికి సూచించారు. చెరువులు నిండి ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు నిత్యం పర్యవేక్షించాలని, మత్స్యకారులు ఎవరు వెళ్లకుండా చూడాలని, మెదక్ జిల్లా పాపన్నపేట ఏడుపాయల వద్ద వరద ఉధృతి పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా మానిటరింగ్ చేయాలని పేర్కొన్నారు.
మెదక్ 157, సిద్ధిపేట 257, సంగారెడ్డి 227 ఇల్లు పాక్షికంగా కూలిన నేపథ్యంలో వారికి అండగా నిలవాలని ఆదేశించారు. ప్రభుత్వం తరుపున ఆర్థిక సాయం అందించాలని ఆయా జిల్లా కలెక్టర్లకు సూచనలు చేశారు. సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో ఉంటూ, ఎప్పటికప్పుడు పరిస్థితులు తెల్సుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. సిద్ధిపేటలో 660 చెరువులు పూర్తిగా నిండిన నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని చెప్పారు. కలెక్టర్లకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు.కేసీఆర్ కిట్ సమాచారం ఆధారంగా డెలివరీ అయ్యే గర్భిణీల వివరాలు ముందుగా తెలుసుకొని వారి ఆరోగ్య పరీక్షలు చేసి మూడు నాలుగు రోజుల ముందుగానే చేర్చుకోవాలన్నారు. అన్నపూర్ణ, తోటపల్లి, రంగనాయక సాగర్ తదితర
ఉమ్మడి జిల్లాలో ఉన్న రిజర్వాయర్ల పరిస్థితులపై ఎప్పటికప్పుడు పరిరక్షించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రాత్రివేళ వర్షం ఎక్కువ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో, అందరూ అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి ప్రాణా నష్టం జరగకుండా చూడాలని పేర్కొన్నారు.