హైదరాబాద్: నెహ్రూ ఔటర్ రింగ్‌రోడ్డులోని (ఓఆర్‌ఆర్‌పై) ఉన్న ఎగ్జిట్ పాయింట్లు 2, 7లను అధికారులు మూసివేశారు. ఈ రోడ్డులోని 2, 7 ఎగ్జిట్ పాయింట్‌లలో నీరు నిలిచిపోవడంతో మూసివేస్తున్నట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ ప్రకటించారు. వీలైనంత త్వరగా వాటిని తిరిగి తెరుస్తామని ట్విటర్ ద్వారా అర్వింద్‌కుమార్ ప్రకటించారు. పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్)పై గుంతలు ఏర్పడ్డాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు అధిక లోడుతో వస్తున్న భారీ వాహనాలతో ఓఆర్‌ఆర్‌పై ఉన్న 3, 4 లేన్లలో బిట్టీ (తారు) లేచిపోయి గుంతలమయంగా మారింది.
దీంతో కోకాపేట నుంచి గచ్చిబౌలి, కొల్లూరు నుంచి పటాన్‌చెరు, ఘట్‌కేసర్ నుంచి పెద్దఅంబర్‌పేట, కండ్లకోయ నుంచి పటాన్‌చెరు వరకు రోడ్లు గుంతలమ యంగా మారింది. ఈ నేపథ్యంలోనే విజయవాడ, ముంబై, నాగపూర్, బెంగళూరు రూట్లలో వెళ్లే భారీ వాహనాలను ఇప్పటికే ఓఆర్‌ఆర్ ఎక్కకుండా అధికారులు నిలిపివేస్తున్నారు. అయితే వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్ జామ్ కావడంతో భారీ వాహనాలు రాత్రి సమయంలో ఓఆర్‌ఆర్ పైకి వస్తున్నాయని దీంతో భారీ గుంతలు ఏర్పడుతున్నాయని హెచ్‌ఎండిఏ అధికారులు తెలిపారు.