Friday, November 22, 2024

హస్తం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ !

- Advertisement -
- Advertisement -

బిజెపి పార్టీలోని అసంతృప్త నాయకులకు గాలం
రహస్య మంతనాలతో నిరంతరం టచ్‌లో…
వేరే రాష్ట్రాల్లో మాటామంతీ

మనతెలంగాణ/హైదరాబాద్: బిజెపి పార్టీలో నెలకొన్న అసంతృప్తులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీలో బిసి నాయకుడిని అధ్యక్ష పదవి నుంచి తప్పించడంపై విమర్శలు గుప్పిస్తున్న హస్తం నాయకులు ప్రస్తుతం బిజెపి పార్టీలో అంటీముట్టనట్టుగా వ్యవహారిస్తున్న నాయకులపై గురి పెట్టారు. వారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు తెరవెనుక రాజకీయం మొదలుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో చేరికలపై హస్తం పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. భారత్ జోడోయాత్ర, కర్ణాటక ఎన్నికల ఫలితాలు సందర్భంగా హస్తం పార్టీలో జోష్ వచ్చింది. క్షేత్రస్థాయిలో కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. దీనిని మరింత బలోపేతం చేసుకొని అధికారం చేజిక్కించుకోవాలన్న ఆలోచనతో ఆ పార్టీ ముందుకు వెళ్తోంది.

గుట్టుచప్పుడు కాకుండా సమావేశాలు

అందులో భాగంగా బిజెపిలో నెలకొన్న అలజడిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని రోజులుగా బిజెపి నాయకుల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు బయటపడుతున్నాయి. రెండు వర్గాలుగా చీలిపోయి ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన కలిగించేటట్లు వ్యవహారిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేస్తోంది. ఇతర పార్టీల నుంచి బిజెపిలోకి వెళ్లిన నాయకులను తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకురావాలన్న ఆలోచనతో పిసిసి ముందుకు వెళుతోంది. ఇప్పటికే పార్టీలో బండి సంజయ్ వ్యతిరేక వర్గంగా కొనసాగుతున్న నేతలతో పలుమార్లు పిసిసి సంప్రదింపులు జరిపినట్లుగా సమాచారం. అయితే ఇప్పటికిప్పుడు హస్తం పార్టీలోకి రావడానికి కొందరు నాయకులు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ నుంచి వెళ్లిన వారితోనూ….

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్, డికె అరుణ తదితరులను పార్టీలోకి తీసుకురావడం వల్ల మరింత ఊపు వస్తుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో రహస్యంగా పలువురు బిజెపి నాయకులతో మంతనాలు జరిపినట్టుగా తెలిసింది. ఈ రహస్య సమావేశం సైతం బయటి రాష్ట్రాల్లో జరిగినట్లుగా సమాచారం. అదేవిధంగా తెలంగాణలో ఏఐసిసి కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉన్న కర్ణాటక చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసు రాజు ద్వారా కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిన నాయకులతో సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

చేరికలు ఆలస్యం

ప్రస్తుతం బిఆర్‌ఎస్, బిజెపిలోని కొందరు నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ ఇప్పటికిప్పుడే ఆయా పార్టీల నాయకులు చేరేందుకు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అసంతృప్తులను ఆయా పార్టీలు బుజ్జగిస్తుండటంతో చేరికలు ఆలస్యమవుతాయని కాంగ్రెస్ భావిస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో నిర్వహించనున్న పాలమూరు ప్రజాభేరి సభలో భారీగా చేరికలు ఉండేలా కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి చెందిన ముగ్గురు, నలుగురు ముఖ్య నాయకులతో హస్తం నాయకులు చర్చలు జరిపినట్టుగా తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో గెలిచేందుకు అవకాశం ఉన్న గెలుపు గుర్రాలకే టికెట్లు దక్కుతాయని, టికెట్లు కేటాయింపు పారదర్శకంగా ఉంటుందని పార్టీలో చేరితే వారికి భవిష్యత్‌లో మంచి స్థానం ఉంటుందని పార్టీలో చేరే వారికి నచ్చచెబుతూ వారిని పార్టీలో చేరేలా పిసిసి పావులు కదుపుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News