Thursday, October 24, 2024

నేడు కూడా విద్యా సంస్థలకు సెలవు

- Advertisement -
- Advertisement -

ఎడతెరిపిలేని వర్షాలతో సిఎం కెసిఆర్ నిర్ణయం

మన తెలంగాణ / హైదరాబాద్ : గత వారం రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వరదలపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్.. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు నేడు శుక్రవారం కూడా సెలవు ప్రకటించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు. వర్షాలతో శుక్రవారం ప్రభుత్వం సెలవు ప్రకటించగా..

శనివారం మొహర్రం సెలవు కావడంతో ప్రభుత్వ విద్యాసంస్థలు అన్నీ ఇక సోమవారం రోజునే తెరుచుకోనున్నాయి. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. ములుగు జిల్లా ప్రత్యేకాధికారిగా కృష్ణ ఆదిత్య, భూపాలపల్లి జిల్లాకు పీ.గౌతమ్, నిర్మల్ జిల్లాకు ముషారఫ్ అలీ, మంచిర్యాల జిల్లా ప్రత్యేక అధికారిగా భారతి హోళికేరిని నియమించారు. ఇందుకు అనుగుణంగా సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

హైదరాబాద్‌కు హైఅలర్ట్

వరుస వానలతో మరోసారి హైదరాబాద్ నగరానికి హై అలర్ట్ విధించారు. తాజాగా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గత నాలుగు రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ వర్షంలో తడిసి ముద్దవుతున్నది. నిన్న గురువారం కూడా భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి హైదరాబాద్ వాతావరణ శాఖ హైఅలర్ట్‌ను ప్రకటించింది. శుక్రవారం కూడా రాత్రి గంటకు 5 సెం.మీ. నుంచి 6 సెం.మీ. వర్షం కురిసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించడం గమనార్హం.

కాగా, తెలంగాణలో రెండ్రోజులపాటు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి-భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. నిర్మల్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News