మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం కూడా వరదలు సద్దుమణిగాక కాకుండా తక్షణమే నిధులను విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అనేక మంది నిరాశ్రయులు అయ్యారని, వారికి తాత్కాలిక శిబిరాలలో తగు వసతి కల్పించాలని ఆయన అన్నారు. వరద సహాయ చర్యల్లో విస్తృతంగా పాల్గొని ప్రజలను ఆదుకోవాలని ఇటు తమ పార్టీ శ్రేణులను కూడా కోరుతున్నానని కూనంనేని పిలుపు నిచ్చారు. ప్రభుత్వ సహాయ చర్యలకు సహకరించడంతో పాటు , ఎక్కడైనా లోటు పాట్లు ఉంటే స్వయంగా సరి చేయడంతో పాటు, వెన్వెంటనే ప్రభుత్వం యంత్రాంగానికి సమాచారం అందించాలని కోరారు.
Also Read: ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి
భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ చర్యలను ముమ్మరం చేయాలని, తెగిపోయిన చెరువు కట్టలు, మురుగు వ్యవస్థల మరమ్మతులకు తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులను విడుదల చేయాలని ప్రభుత్వానికి సిపిఐ విజ్ఞప్తి చేస్తోందన్నారు. కొత్తగూడెం భద్రాచలం , వరంగల్ జిల్లాలు, హైదరాబాద్ పరిధిలో పెద్ద ఎత్తున అనేక ప్రాంతాలు జలమయమయ్యాయని కూనంనేని తెలిపారు. ఇళ్ళు కోల్పోయిన నిరాశ్రయులకు శాశ్వత పరిష్కారంగా పక్కా ఇళ్లు నిర్మించాలన్నారు. భద్రాచలంలో ప్రతి సంవత్సరం వరదలు నిత్యకృత్యమయ్యాయని, దాని పరిష్కారం కోసం గోదావరికి ఇరువైపుల గుండాల నుండి కన్నాయిగూడెం వరకు, బూర్గుంపాడు నుండి ఏలేరు వరకు కరకట్టలు నిర్మించాలని కోరారు.
కొత్త గూడెం జిల్లాలో అనేక చోట్ల గ్రామపంచాయతీలో కాలువులు తెగిపోవడంతో పాటు చెరువుల ఆక్రమణకు గురవడంతో నీళ్ళు రోడ్లపైకి, జనావాసాలలోకి వచ్చాయన్నారు. డ్రెయిన్ మరమ్మతు, పునరిర్మాణానికి తాత్కాలిక, దీర్ఘకాలిక పనుల కోసం నిధులను విడుదల చేయాలన్నారు. గతంలో గ్రామ పంచాయతీలకు బిల్లు చెల్లించకపోవడంతో పలు చోట్ల బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు కూడా నిధులు లేవని, తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించాలన్నారు. లేదంటే అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నదని చెప్పారు. కిన్నెరసాని నదీ పరీవాహక ప్రాంతంలో రంగాపురం తదితర చోట్ల మోటార్లు కొట్టుకుపోయాయన్నారు.