వైద్య సేవల్లో అంతరాయం కలగకుండా చర్యలు
503 మంది గర్భిణులను ముందస్తుగా ఆసుపత్రికి తరలింపు
డిపిహెచ్ పరిధిలో వైద్య సిబ్బందికి సెలవులు రద్దు
మన తెలంగాణ/ హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, వైద్యారోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండి, ప్రజారోగ్య పరిరక్షణ చర్యలు తీసుకుంటున్నది. అన్ని విభాగాల అధిపతులు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అడిగి తెలుసుకుంటున్నాను. మంత్రి హరీశ్ రావు ఎప్పటికపుడు జిల్లాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో వుండి, వైద్య సేవల్లో అంతరాయం లేకుండా చూస్తున్నారు.
ముఖ్యంగా గర్భిణుల ఆరోగ్య సంరక్షణ విషయంలో మంత్రి ఆదేశాల మేరకు డెలివరీ డేట్ దగ్గరగా ఉన్న గర్భిణులను ఆసుపత్రులకు తరలించడం జరిగింది. ఈనెల 20 నుండి 26 వరకు అన్ని జిల్లాలో 327 మందిని, ఈనెల 27న 176 మందిని, మొత్తంగా 503 ఆసుపత్రుల్లోనీ బర్త్ వెయిటింగ్ రూములకు సురక్షితంగా తరలించడం జరిగింది. వీరి వెంట అటెండెంట్ కి వసతితో పాటు, భోజన సౌకర్యం ప్రభుత్వం కల్పించింది. ఈవిధంగా ముందస్తు చర్యలు తీసుకుంటూ గర్భిణుల సంరక్షణకు వైద్యారోగ్య శాఖ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది.
సబ్ సెంటర్ స్థాయి నుండి హైదరాబాద్ లోని ప్రధాన ఆసుపత్రుల వరకు వైద్య సిబ్బంది పూర్తి సంసిద్ధతతో ఉన్నారు. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. జిల్లా, ఏరియా, సీహెచ్సీ, ఎంసీహెచ్ ఆసుపత్రుల వారీగా ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందించేందుకు గాను రాష్ట్ర స్థాయిలో 24 గంటలు స్టేట్ లెవల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ 040-24651119 ఏర్పాటు చేశారు. దీనికి అనుబంధంగా జిల్లా స్థాయిలో కాల్ సెంటర్ అందుబాటులో ఉంచారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది పంచాయతీ రాజ్, మున్సిపల్ తదితర శాఖల సమన్వయంతో చేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నది.
వైద్య సిబ్బందికి సెలవులు రద్దు
మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు, రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో డీపీహెచ్ పరిధిలోని సిబ్బందికి సెలవులు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే మంజూరు చేసిన వారికి కూడా ర్ద్దు చేసి, తిరిగి విధుల్లో చేరాల్ని ఆదేశించారు. ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందుబాటులో ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.