న్యూఢిల్లీ : మణిపూర్‌లో వెలుగులోకి వచ్చిన భయానక దృశ్యాల వీడయోపై సిబిఐ దర్యాప్తు జరుగుతుంది. ఈ మేరకు కేంద్రం సిబిఐకి ఆదేశాలు వెలువరించిందని అనధికారిక వర్గాల ద్వారా గురువారం తెలిసింది. ఇద్దరు గిరిజన తెగ మహిళలను ఓ మూక నగ్నంగా ఊరేగించి, తరువాత అత్యాచారానికి పాల్పడిన ఘట్టం వీడియోగా వెల్లడైంది. ఇది దేశవ్యాప్తంగా ప్రకంపనలకు , ప్రత్యేకించి సంఘటిత ప్రతిపక్షం నుంచి తీవ్రస్థాయి ఎదురుదాడి పరిస్థితి ఏర్పడటంతో కేంద్రం స్పందించింది. సంబంధిత వీడియోపై మణిపూర్ వెలుపల సిబిఐ విచారణ ఉండాలని కేంద్రం కోరుకుందని వెల్లడైంది. గత మూడు నెలలుగా మణిపూర్ తీవ్రస్థాయి ఘర్షణలతో ఉడుకెత్తింది.
ఈ దశలోనే కలిచివేసే రీతిలో ఉన్న వీడియో ఇంటర్నెట్‌కు ఎక్కింది. వీడియోపై కేంద్రం తరఫున త్వరలో అఫిడవిట్ దాఖలు కానుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ఒక్కరోజు ముందే ఈ వీడియో వెలువడింది. దీనితో ఆరంభం నాటి నుంచే ప్రతిపక్ష కూటమి ఇండియా నుంచి దీనిపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాని మోడీ దీనిపై వెంటనే సభకు వివరణ ఇచ్చుకోవాల్సి ఉందని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అయితే దీనికి ప్రభుత్వం ససేమిరా అంది. మణిపూర్ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధం అని, హోం మంత్రి అమిత్ షా ప్రభుత్వం తరఫున జవాబు ఇస్తారని తెలిపారు.