బెంగళూరు : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తదుపరి ప్రతిష్టాత్మక ఘట్టం మానవసహిత గగన్‌యాన్‌కు శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరో రెండు ఇంధన జ్వలిత ఛాలక ప్రక్రియ ప్రపొల్షన్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. ఇటీవలే చంద్రయాన్ 3 ద్వారా ఇస్రో చంద్రుడి ఉపరితలానికి వాహకనౌకను పంపించే ప్రక్రియను చేపట్టింది. ఇప్పుడిక అంతరిక్షంలోకి మనుష్యులను తీసుకువెళ్లే గగన్‌యాన్‌ను తలపెట్టారు. సరైన విధంగా దీనిని ప్రయోగించేందుకు అవసరం అయిన మరో రెండు కీలక పరీక్షలను ముగించినట్లు ,
గగన్‌యాన్ సర్వీసు మాడ్యూల్ ప్రపొల్షన్ సిస్టమ్ (ఎస్‌ఎంపిఎస్)కు సంబంధించి ఇవి అగ్నిపరీక్ష వంటివని ఇస్రో వర్గాలు తెలిపాయి. తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రపల్సన్ కాంప్లెక్స్‌లో బుధవారం జరిపిన పరీక్షలు విజయవంతం అయినట్లు, అన్ని నిర్థారించుకున్న తరువాత ఇస్రో వర్గాలు గురువారం ప్రకటన వెలువరించాయి. మానవయుత వ్యోమనౌక ద్వారా ముగ్గురిని 400 కిలోమీటర్ల కక్షలో మూడు రోజుల పాటు అంతరిక్షం విహరింపచేసే ప్రతిష్టాత్మక గగన్‌యాన్‌కు ఇస్రో ఇప్పుడు సమాయత్తం అయ్యింది. అంతరిక్ష కక్షలో వీరిని తీసుకవెళ్లడం తరువాత వీరిని సురక్షితంగా సముద్ర మార్గం ద్వారా తిరిగి భువికి చేర్చడం ఈ గగన్‌యాన్ లక్షంగా పెట్టుకున్నారు.