న్యూఢిల్లీ: మణిపూర్‌లో హింసపై ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో ప్రకటన చేయనందుకు నిరసనగా ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ గురువారం రాజ్యసభకు చెందిన సభా వ్యవహారాల సలహా కమిటీ(బిఎసి) సమావేశాన్ని బహిష్కరించింది. రాజ్యసభ బిఎసిలో 11 మంది సభ్యులుండగా, సభ చైర్మన్, ఉప రాష్ట్రపతి కమిటీకి ఎక్స్‌అఫీషియో చైర్మన్‌గా ఉన్నారు. 26 పార్టీల ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’కు చెందిన సభ్యులు ముగ్గురు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన జైరాం రమేశ్, ఆర్‌జెడికి చెందిన మిసాభారతి, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన డెరిక్ ఓ బ్రియాన్‌తో పాటుగా బిఆర్‌ఎస్ సభ్యుడు కె కేశవరావు కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. గత కొన్ని వారాలుగా ప్రతిపక్ష సభ్యులు పలు సమావేశాలకు గైరుహాజరు కావడమో, బాయ్‌కాట్ చేయడమో చేస్తున్నారు.
బుధవారం కూడా శివసేన( షిండేవర్గం)ఎంపి ప్రతాప్ రావు జాదవ్ నేతృత్వంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన పార్లమెంటు స్థాయీ సంఘ సమావేశంలో కొత్త వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుపై నివేదికను కమిటీ ఆమోదించడంపై నిరసనగా ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు వాకౌట్ చేశారు.ఈ బిల్లును అధికారికంగా కమిటీకి నివేదించలేదని, అనధికారికంగా జరిగిన చర్చల ఆధారంగా నివేదికను రూపొందించకూడదని ప్రతిపక్ష సభ్యులు వాదించారు. సమావేశానికి ముందు రోజు ఈ ముసాయిదా నివేదికను సభ్యులకు అందజేశారు. ఇలాంటి నివేదిక తయారవుతోందనే విషయం తమకు చెప్పనే లేదనేది ప్రతిపక్ష సభ్యుల వాదన. దీంతో దాదాపు గంట సేపు కమిటీలోని ఏడుగురు ప్రతిపక్ష ఎంపీలు, ఎనిమిది మంది అధికార కూటమి సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది. చివరికి విపక్ష సభ్యులు లేకుండానే నివేదికను ఆమోదించారు.