న్యూఢిల్లీ: హింసాత్మకంగా మారిన మణిపూర్‌లో ఇద్దరు మహిళలపై లైంగిక దాడి, హింసకు సంబంధించిన దురదృష్టకర, ఆమోదయోగ్యంకాని ఘటన దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)కు బదిలీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.
ఈ ఘటన వెలుగుచూసినప్పటి నుంచి ఈ కేసును కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిరంతరం పర్యవేక్షిస్తోందని హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మహిళలపై జరిగే ఎటువంటి నేరాలనైనా ఉపేక్షించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. మణిపూర్ ఘటనను అత్యంత హేయమైన నేరంగా కేంద్రం పరిగణిస్తోందని, ఈ ఘటన తీవ్రతను పరిగణనలోకి తీసుకుని కఠినాతి కఠినమైన ఛిక్ష విధించేలా చర్యలు ఉండాలని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది. మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి ఒక గుణపాఠంగా ఇది ఉండాలని కేంద్రం అభిప్రాయపడింది.
ఈ కేసు విచారణను మణిపూర్ వెలుపకు బదిలీ చేయాలని కూడా కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. చార్జిషీట్ దాఖలైన తర్వాత ఆరునెలల్లోగా విచారణ పూర్తయ్యే విధంగా నిర్ధిష్ట కాలపరిమితిని విధించాలని కేంద్రం కోరింది.