ముందే మేల్కొని ఉంటే ప్రాణ, ఆస్తి నష్టం జరిగేది కాదు
మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, ఇండ్లు కోల్పోయిన వారికి రూ.10 లక్షలివ్వాలి
హైదరాబాద్ : రాష్ట్రంలో వరదలతో తప్ప.. భారీ వర్షాల కారణంగా ఇంత పెద్ద సంఖ్యలో ఎన్నడూ చనిపోయిన దాఖలాలు లేవని బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో అపార ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఇప్పటికే 20 మంది చనిపోయారు. మరో 25 మంది గల్లంతయ్యారు. ఇంతవరకు వారి ఆచూకీ లేదు. వేలాది సంఖ్యలో పశువులు చనిపోయాయి. వేలాది ఇండ్లు మునిగిపోయాయి. లక్షల ఎకరాల్లో పంట, ఆస్తి నష్టం జరిగింది. రోడ్లు ధ్వంసమయ్యాయి. అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు.
ముంపు బాధిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ముందే మేల్కొని ఉంటే ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించే అవకాశముండేది. కేంద్ర ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగేవరకు రాష్ట్ర బృందాలు ముంపు ప్రాంతాల్లోకి వెళ్లలేకపోయాయి. రాష్ట్ర అధికారులు కష్టపడుతున్నా ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందకపోవడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఇప్పటికీ అనేక జిల్లాల ప్రజలు భారీ వర్షాలతో అల్లాడుతున్నారు. ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం క్షమించరానిది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన సహాయ పునరావాస చర్యలు తీసుకోవాలి. మరణించిన వారి కుటుంబాలకు రూ.20 లక్షలు, ఇండ్లు కోల్పోయిన కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున సాయం అందించాలి. బిజెపి కార్యకర్తలంతా ముంపు బాధిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నా. అందులో భాగంగా ఆదివారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ముంపు బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తానని బండి సంజయ్ తెలిపారు.