Friday, November 22, 2024

ఈ నాటకాలు మానండి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజునుంచీ మణిపూర్ అంశంపై చర్చ జరగాలంటూ ప్రతిపక్షాలు పార్లమెంటు ఉభయసభలను స్తంభింపజేస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్, టిఎంసి, ఆప్ ఇతర ప్రతిపక్షాల సభ్యులు పెద్ద ఎత్తుప నినాదాలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఈ అంశంపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి.శుక్రవారం కూడా ఇదే పరిస్థితి పునరావృతమైంది. రాజ్యసభలో టిఎంసి సభ్యుడు డెరిక్ ఒబ్రియాన్, చైర్మన్ జగదీప్ ధన్‌కర్ మధ్య ఈ విషయమై వాడీ వేడి సంభాషణ జరిగింది. చివరికి సభ అర్ధాంతరంగా వాయిదా పడింది.

రాజ్యసభలో అన్ని కార్యకలాపాలను వాయిదా వేసి తాము లేవనెత్తిన అంశంపై చర్చించాలని కాంగ్రెస్, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, ఎస్‌పి, ఎన్‌సిపి, డిఎంకు పార్టీలకు చెందిన 47 మంది ఎంపీలు శుక్రవారం ఉదయం రూల్ 267 ప్రకారం నోటీసులు ఇచ్చారు. అయితే సభ ప్రారంభమైన వెంటనే ఇద్దరు సభ్యులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. అలాగే పదవీ విరమణ చేస్తున్న బిజెపి ఎంపి వినయ్ దినేర్ తెండూల్కర్‌కు వీడ్కోలు పలికింది.అనంతరం రూల్ నంబరు 267 కింద నోటీసు ఇచ్చిన ఎంపీల పేర్లను చైర్మన్ ధన్‌కర్ చదివారు. సభ్యులు లేవనెత్తిన అంశంపై చర్చించడానికి అనుమతించిన విషయాన్ని గుర్తు చేశారు.

పార్టీలకు అతీతంగా స్వల్పకాలిక చర్చలో పాల్గొనాలని కోరారు. ప్రజలకు స్ఫూర్తిదాయకంగా సభ్యులు ప్రవర్తించాలని కోరారు. ప్రతిరోజూ ఒకే విధమైనపరిస్థితి కొనసాగడం వల్ల సభ్యులకు దక్కాల్సిన గౌరవం దక్కదన్నారు.తాను అనేక విధాలుగా సమాచారం సేకరించానని,ఈ సమాచారం చాలా బాధాకరంగా ఉందన్నారు. వరసగా ప్రతి సమావేశంలోను రూల్ 267 ప్రకారం అనేక నోటీసులు వస్తున్నాయన్నారు.గడచిన 23 ఏళ్లలో ఇటువంటి ఎన్ని నోటీసులకు అనుమతి లభించిందో ఈసభకు తెలుసునన్నారు.ప్రశ్నోత్తరాల సమయం చాలాముఖ్యమైనదని, ఎంపీలు ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడుగుతారని చెప్పారు. పార్లమెంటరీ కరార్యకలాపాలకు ప్రశ్నోత్తరాల సమయం హృదయం లాంటిదని అన్నారు.దంఈతో ఒ బ్రియాన్ స్పందిస్తూ ‘ఇదంతా మాకు తెలుసు’నని అన్నారు.

ఈ సమావేశాలు ప్రారంభమైనప్పటినుంచి మణిపూర్ సమస్యను ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయని, దానిని చేపట్టాలని డిమాండ్ చేశారు. జగదీప్ ధన్‌కర్ స్పందిస్తూ ‘దీని గురించి మీకు తెలుసునని నాకూ తెలుసు.మీరు చెప్పనక్కరలేదు. కేవలం వినండి చాలు. మీరు వింటే మీకు అర్థమవుతుంది’ అని అన్నారు.కానీ ఒబ్రియాన్ వెనుకంజవేయలేదు. దీంతో ఆయనను తన స్థానంలో కూర్చోవాలని ధన్‌కర్ కోరారు.‘ మిస్టర్ డెరెక్ ఒ బ్రియాన్ నాటకీయ ప్రదర్శనలు చేయడం మీకు అలవాటుగా మారింది. ప్రతిసారి మీరు లేచి నిలబడతారు.

అది మీ విశేషాధికారంగా భావిస్తారు. సభాపతి స్థానాన్ని గౌరవించడం మీ కనీస బాధ్యత.నేను ఏం చెప్పినా మీరు లేచి నాటక ప్రదర్శన మొదలుపెడతారు’ అని అని మండిపడ్డారు. ధన్‌కర్ వ్యాఖ్యలపై ఒ బ్రియాన్ స్పందిస్తూ తన ముందున్న బల్లపై గట్టిగా కొడుతూ తాను నిబంధనలకు అనుగుణంగానే ప్రవర్తిస్తున్నానని అన్నారు. దీంతో ధన్‌కర్ స్పందిస్తూ,‘ బల్లమీద కొట్టకండి, ఇది రంగస్థలం కాదు’అన్నారు. ‘ దీన్ని మేము సహించం, ఐయామ్ సారీ’అన్నారు. ఒబ్రియాన్ ఏదో చెప్పబోతుండగా ధన్‌కర్ సభను సోమవారానికి వాయిదా వేశారు.‘ దీనిని మేం సహించం’ అంటూ వెళ్లిపోయారు.

లోక్‌సభ కూడా వాయిదా
శుక్రవారం లోక్‌సభ సమావేశం కాగానే అవిశ్వాసతీర్మానంపై తక్షణమే చర్చజరపాలంటూ విపక్ష సభ్యులు నిరసన మొదలుపెట్టారు. దీనిపై స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ ఎంతో కీలకమైన ప్రశ్నోత్తరాలను అనుమతించాలని కోరుకోవడం లేదా అని ప్రశ్నించారు. ఈ సమయంలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ 1978 మార్చి10న పెట్టిన అవిశ్వాసతీర్మానంపై స్పీకర్ అనుమతించిన వెంటనే చర్చ జరిగిందని గుర్తు చేశారు.

దీనికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందిస్తూ అన్నీ నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని, 10 రోజుల్లోపు అవిశ్వాసంపై ఎప్పుడైన చర్చించవచ్చన్నారు.ఈ క్రమంలో విపక్ష సభ్యుల నిరసనలు కొనసాగుతుండగా తొలుత మధ్యాహ్నం 12గంటలకు సమావేశం వాయిదాపడింది. ఆ తర్వాత తిరిగి సమావేశమైన తర్వాత కొద్ది సేపు చర్చ అనంతరం సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమై వారం రోజులైనా ఉభయ సభల్లో ఒక్క రోజయినా పూర్తిస్థాయి కార్యకలాపాలు జరగకపోవడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News