హైదరాబాద్ : వరదల కారణంగా ప్రధాన నగరాల్లోని ప్రజల జీవితాలు అతలాకుతలమైందని, ఇళ్లలోకి నీరు, పాములు చేరుతున్న పరిస్థితి నెలకొందని టిపిసిసి ఉపాధ్యక్షులు మల్లు రవి పేర్కొన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వర్షాలు, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు ఏ ప్రభుత్వాలు ఉన్నా రెయిన్‌బో లాంటి డ్రెనేజి వ్యవస్థను ఏర్పాటు చేయాలని అప్పుడే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం ఉండదన్నారు. వరదలతో కాలనీలు చెరువులుగా తలపిస్తున్నాయని త్రాగునీరు దొరక్క ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని వరద సహాయక చర్యలు చేపట్టడంలో అధికారులు నిర్లక్షం వహిస్తున్నారని మండిపడ్డారు. టిపిసిసి రేవంత్ రెడ్డి ఆదేశాలతో కాంగ్రెస్ శ్రేణులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని, సీతక్క, పొంగులేటి వరద బాధితులకు ఆహారం సౌకర్యాలు ఏర్పాటు చేశారన్నారు. సచివాలయం, ప్రగతి భవన్ లాంటి భవనాలు నిర్మిస్తే అది బంగారు తెలంగాణ కాదని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో వరద బాధితులకు రూ. 10 వేల పరిహారం ప్రకటించారని ప్రస్తుతం ఎలాంటి ప్రకటన చేయకపోవడం బాధకరమన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్లడ్ రిలీఫ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు జైపాల్ రెడ్డి వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినట్లు, తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడంలో జైపాల్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారని, జైపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికే తలమానికమని ప్రశంసించారు.