మంథని: భారీ వర్షాలకు కరెంటు కోల్పోయిన గ్రామాలకు యుద్ద ప్రాతిపదికన విద్యుత్‌సరఫరా పునరుద్ధరణ చేశామని ట్రాన్స్ కో పెద్దపల్లి జిల్లా ఎస్‌ఈ బొంకూరి సుదర్శన్ అన్నారు. శుక్రవారం మంథనిలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్దపల్లి జిల్లాలో నాలుగు గ్రామాల్లో నిలిచిన విద్యుత్ సరఫరాను శుక్రవారం పునరుద్ధ్దరణ చేశామన్నారు. మండలంలోని అడవిసోమన్‌పల్లి, నాగేపల్లి, చిన్న ఓదాల, ముత్తారం మండలంలోని పారుపల్లి గ్రామాలకు కరెంటు అందించామన్నారు.
జిల్లాలో 626 ట్రాన్స్‌ఫార్మర్లకు విద్యుత్ నిలిపి వేశామన్నారు. ఎన్ని విద్యుత్ స్థంభాలు, వైర్లు నష్టపోయామనేది వరదలు తగ్గిన తర్వాతనే తెలుస్తోందన్నారు. వరదల వల్ల తమ శాఖకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందన్నారు. జిల్లాలో ముత్తారం మండలంలో ఎక్కువ నష్టం జరిగిందన్నారు. ఈ సమావేశంలో మంథని డీఈ శివరాం, ఏఈలు శ్రీనివాస్, మల్లయ్య పాల్గొన్నారు.