మన తెలంగాణ/ హైదరాబాద్ : దేశంలోనే అతి పెద్ద మంచినీటి ఆక్వా పార్క్ త్వరలో తెలంగాణలో రాబోతోందని టిఎస్‌టిపిసి జాయింట్ ఎండి ఇ.విష్ణు వర్ధన్ రెడ్డి, ఐఎఫ్‌ఎస్ పేర్కొన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ 1350 ఎకరాల్లో వరంగల్‌లో రాబోతోందని, ఇది ఫైబర్ నుండి ఫ్యాషన్‌కు గొప్పగా చెప్పవచ్చని అన్నారు. ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావు దీనిని సెప్టెంబర్‌లో ప్రారంభించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ప్రత్యేక బొమ్మల పార్క్, ప్రత్యేకమైన ఫర్నిచర్ పార్క్, ప్రత్యేక జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ కూడా రాష్ట్రంలో రాబోతున్నాయి.
రాష్ట్రంలో ఎగుమతి వ్యూహాలను పునరుద్దరించేందుకు కృషి చేస్తున్నామని, యుఎఇ ఎగుమతులలో తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యత కలిగిన దేశమని ఆయన చెప్పారు. యుఎఇ -ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యుఐబిసి) న్యూఢిల్లీ సహకారంతో తెలంగాణా చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టిసిసిఐ) సమగ్ర ఆర్థిక ఒప్పందం (సిఇపిఎ), సంబంధిత వ్యాపార అవకాశాలపై సమావేశం జరిగింది. ఈ సెషన్ యుఎఇ, తెలంగాణ, భారతదేశం మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సిఇపిఎ), సంబంధిత వ్యాపార అవకాశాలను హైలైట్ చేయడం లక్ష్యంగా చేసుకుంది.
ఎఫ్‌టిసిసిఐ అధ్యక్షుడిగా కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రెసిడెంట్ మీలా జయదేవ్ తన స్వాగత ప్రసంగాన్ని ఇస్తూ, ఇది భారతదేశం-యుఎఇ సిఇపిఎ అమలు మొదటి వార్షికోత్సవమని అన్నారు. ఈ వ్యాపార సెషన్ సమయానుకూలమైనది, సమయోచితమైనది కూడా అని అన్నారు. ఈ బిజినెస్ సెషన్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ సింఘాల్, ఎఫ్‌టిసిసిఐ సిఇఒ ఎంఎస్ ఖ్యాతి నరవాణే తదితరులు పాల్గొన్నారు.