సత్నా: మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లా మైహర్ పట్టణంలో 12 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి, క్రూరంగా హింసించిన ఇద్దరు నిందితుల ఇళ్లను స్థానిక పాలనా యంత్రాంగం శనివారం కూల్చివేసింది.
మైహర్‌లోని మా శారదాదేవి ఆలయానికి చెందిన ట్రస్టు కమిటీలో ఉద్యోగం చేస్తున్న రవీంద్ర కుమార్ రవి, అటుల్ భడోలియా గురువారం ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆ బాలిక శరీరమంతా కొరకడంతోపాటు ఆమె మర్మాంగంలోకి ఒక బలమైన వస్తువును తోసి హింసించినట్లు పోలీసు వర్గాలు శుక్రవారం తెలిపాయి. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న ఆ బాలికను ఆసుపత్రికి తరలించిన పోలీసులు నిందితులు ఇద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వారిద్దరికీ న్యాయమూర్తి 14 రోజుల జుడిషియల్ రిమాండ్ విధించారు. వీరిద్దరినీ ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఆలయ ట్రస్టు కమిటీ ఇప్పటికే ప్రకటించింది.
కాగా..నిందితులు నివసిస్తున్న ఇళ్లకు, భూమికి సంబంధించిన పత్రాలను కోరుతూ వారి కుటుంబ సభ్యులకు మైహర్ మున్సిపల్ కౌన్సిల్‌కు చెందిన చీఫ్ మున్సిపల్ అధికారి శుక్రవారం నోటీసులు ఇచ్చినట్లు పోలీసు అధికారి లోకేష్ దబర్ తెలిపారు. నిందితులిద్దరి ఇళ్లు అక్రమంగా నిర్మించినవని బయటపడిందని ఆయన చెప్పారు. భడోలియా ఇల్లు ప్రభుత్వ భూమిలో నిర్మించగా రవీంద్ర కుమార్ ఇంటికి అనుమతి లేదని ఆయన చెప్పారు. దీంతో వారిద్దరి ఇళ్లను మున్సిపల్ అధికారులు కూల్చివేసినట్లు ఆయన తెలిపారు.