హైదరాబాద్: అత్యాధునిక వైద్య సేవలకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. నగరంలోని ప్రముఖ ఆసుపత్రుల్లో నాణ్యమైన సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందుబాటులో ఉండటంతో చాలా దేశాల ప్రజలు వైద్యం కోసం హైదరాబాద్ వైపు చూస్తున్నారు. కరోనా సమయంలో ఊపిరితిత్తులు పాడై చావు బతుకుల్లో ఉన్న బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి రోగులను ఎయిర్ అంబులెన్స్‌ల ద్వారా నగరానికి తరలించి ప్రాణాలు కాపాడిన సంఘటనలున్నాయి. దాదాపు 30 నుంచి -40 మంది రోగులకు నగర ఆసుపత్రుల్లో ఊపిరితిత్తుల మార్పిడి చేశారు.
సాధారణంగా విదేశీ రోగులు నేషనల్ అక్రిడియేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్స్ (ఎన్‌ఎబిహెచ్)లో ఉన్న ఆసుపత్రులకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుతం నగరంలో నెలకు వందల సంఖ్యలో మోకాళ్ల మార్పిడి, నడుం నొప్పి, మోకాళ్ల నొప్పికి అంతర్జాతీయ స్థాయి చికిత్సలు, శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. అవయవ మార్పిడీల్లోనూ నగరం దూసుకుపోతోంది. అధునాతమైన ఆపరేషన్ థియేటర్లు, పరికరాలు, నిపుణులైన వైద్యులకు ఇక్కడ కొరత లేదు. విదేశాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న వైద్యులు నగర ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నారు. ఈ నేపథ్యంలో విదేశీ రోగులకు మరింత సేవలు అందేలా పలు కార్పొరేట్ ఆసుపత్రులు ట్రాన్స్‌లేటర్లను సైతం నియమిస్తున్నాయి.