చెన్నె : మణిపూర్‌కు సంబంధించి న్యాయవ్యవస్థపై వ్యాఖ్యలకు చెన్నైకు చెందిన ప్రచురణకర్త , బ్లాగర్ బద్రీశేషాద్రిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. శేషాద్రి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో మణిపూర్ హింసాకాండపై మాట్లాడారు. ఈ దశలో ఆయన న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారనేది అభియోగం. కున్నమ్‌కు చెందిన లాయర్ కవివరసు ఈ పబ్లిషర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో ఈ ఉదయం పెరంబలూర్ పోలీసులు శేషాద్రిని అదుపులోకి తీసుకున్నారు.
న్యాయవ్యవస్థపై ఆయన వ్యాఖ్యలు తనను కలవరపర్చినట్లు ఈ లాయర్ తమ ఫిర్యాదులో తెలిపారు. ఈ వ్యక్తి తన భావవ్యక్తీకరణ దశలో చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయని, సామాజిక ఘర్షణలకు దారితీసేవిగా ఉన్నాయని పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టును తమిళనాడు బిజెపి అధ్యక్షులు అన్నామలై ఖండించారు. అధికార డిఎంకె వేధింపుల అజెండాను అమలు చేయడం స్థానిక పోలీసుల తీరు అయిందన్నారు.