న్యూఢిల్లీ: టీమిండియా వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బిసిసిఐ మ్యాచ్ షెడ్యూల్, వేదికలను ప్రకటించింది. తాజాగా ప్రపంచకప్ టికెట్లకు సంబంధించి ఆగస్టు 10 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల న్యూఢిల్లీలో బిసిసిఐ కార్యదర్శి జై షా అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లతో మీటింగ్ నిర్వహించి, పలు అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా టికెట్ల జారీపై కూడా కీలక ప్రకటన చేశారు. ఈ మ్యాచ్‌లకు హాజరయ్యే అభిమానులు తప్పకుండా ఫిజికల్ టికెట్లు (పేపర్ ప్రింటెడ్) తీసుకురావాలని, ఆన్‌లైన్ టికెట్లను అనుమతించేది లేదని తేల్చి చెప్పారు.
ఫిజికల్ టికెట్లు పొందేందుకు అభిమానుల కోసం 7 నుంచి 8 కేంద్రాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపిరు. కాగా, అహ్మదాబాద్, లక్నో వంటి పెద్ద కెపాసిటీ స్టేడియాల్లో ఇ-టికెట్ల నిర్వహణ కష్టమని, అయితే ముందుగా ద్వైపాక్షిక సిరీస్‌లలో ఇ-టికెటింగ్‌ని అమలు చేసి, ఆ తర్వాత ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నమెంట్‌లకు తీసుకెళ్లేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో ప్రపంచకప్ టికెట్ల ధరతో సహా అన్నీ వివరాలు ప్రకటిస్తామని చెప్పారు.
ఇక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం ప్రోటోకాల్‌లో భాగంగా ఐసిసి, బిసిసిఐలు ఒక్కో గేమ్‌కు 300 హాస్పిటాలిటీ టిక్కెట్‌లను అందుకోనున్నాయి. ఇక రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్‌లు ఐసిసికి 1295 లీగ్ గేమ్ టిక్కెట్లతో పాటు టీమిండియాకు సంబంధించిన 1355 టికెట్లను వీటితో పాటు సెమీ-ఫైనల్ మ్యాచ్‌ల టిక్కెట్లను కూడా అందించనుంది. మరో 500 జనరల్ టిక్కెట్లను మాత్రం సదరు క్రికెట్ అసోసియేషన్స్ బిసిసిఐకి ఉచితంగా అందించనున్నాయి.