Saturday, November 23, 2024

కరుగుతున్న హిమానీ నదాలు

- Advertisement -
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా కరుగుతున్న హిమానీ నదాల కారణంగా ఈ శతాబ్దం చివరినాటికి దాదాపు 10 అంగుళాల మేర సముద్ర మట్టం పెరిగే అవకాశం ఉందని నాలుగేళ్ల కిందట ఓ అధ్యయనం హెచ్చరించింది. హిమానీనదాలు చిన్నవైనప్పటికీ సముద్ర మట్టం పెరుగుదలలో చాలా పెద్ద పాత్ర వహిస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. తాజాగా మరో అధ్యయనం హిమాలయాల్లోని మంచు చాలా వేగంగా కరిగిపోతున్నట్టు హెచ్చరించింది.

ఫలితంగా ఈ పర్వత పరిసర ప్రాంతాల్లోని కోట్లాది మంది ప్రజల జీవితాలపై విపరీత ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. మనదేశంలో కూడా అధిక ఉష్ణోగ్రతల కారణంగా వేడిగాలులు వీస్తున్నాయి. హిమాలయ ప్రాంతం లోని హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. దీని కారణంగా తక్కువలో తక్కువగా రెండు బిలియన్ల మంది జీవితాల జీవనోపాధికి ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతాలకు నిలయమైన ఆసియా హిందు కుష్ హిమానీ నదాలు 2011 నుంచి 2020 మధ్యకాలంలో మునుపటి దశాబ్దంతో పోలిస్తే 65 శాతం వేగంగా కరిగినట్టు అధ్యయనం పేర్కొంది.

హిమాలయాల్లోని హిమానీనదాలు కరిగి ఏర్పడుతున్న వేలాదిసరస్సులతో రానున్న రోజుల్లో వరద ప్రళయం తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నేపాల్ వైపు 2070 సరస్సులు ఏర్పడగా, చైనా దిక్కులో 1500 కు పైగా , భారత్ వైపు 45 కు పైగా సరస్సులు ఏర్పడ్డాయని వారు పేర్కొన్నారు.ఈ సరస్సుల పరిమాణం రోజురోజుకు విస్తరిస్తుండడంతో రానున్నరోజుల్లో భారీ వరద ప్రమాదం ముంచుకొస్తుందని హెచ్చరిస్తున్నారు. లడఖ్ లోని హిమాలయాల్లోని పరకాచిక్ హిమానీనదం వేగంగా కరుగుతుండడంతో 34 నుంచి 84 మీటర్ల లోతులో మూడు సరస్సులు ఏర్పడే అవకాశం కనిపిస్తోందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఈ సరస్సుల నుంచి హిమాలయాల్లో వరదలు ముంచెత్తవచ్చని డెహ్రాడూన్ లోని వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియోలజీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పశ్చిమ హిమాలయాల్లోని దక్షిణ జన్‌స్కార్ శ్రేణిలో భాగమైన సురు నదీలోయలో భారీ హిమానీనదాల్లో పరకాచిక్ హిమానీ నదం ఒకటి. కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లో జన్‌స్కార్ పర్వతశ్రేణి విస్తరించి ఉంది. ఈ హిమానీనదం 1971నుంచి 1999 మధ్యకాలం 28 ఏళ్ల కన్నా 19992021 మధ్య 22 ఏళ్లలో చాలా ఆరు రెట్లు వేగంగా కరిగిపోతోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

1971 నుంచి 2021 మధ్యకాలంలో హిమానీనదం ఎంతవేగంగా కరిగి తరిగిపోతోందో శాటిలైట్ డేటా ఉపయోగించి కనుగొన్నారు. ఈ అధ్యయన వివరాలు జర్నల్ అన్నాల్స్ ఆఫ్ గ్లేసియోలజీలో వెలువడ్డాయి. వాతావరణం విపరీతంగా వేడెక్కుతుండడంతో భౌగోళిక మార్పులు సంభవించి హిమానీనదాలు కరిగిపోతున్నాయని అధ్యయనం వివరించింది.

దీనివల్ల కొత్తగా సరస్సులు ఏర్పడడం, ఉన్న సరస్సులు విస్తరించి వరదలు ఉప్పొంగే పరిస్థితి ఏర్పడుతుందని అధ్యయనంలో వివరించారు. హిమానీ నదం భూమిని కోసివేస్తే అంటే అక్కడ ఉన్న భూమి కోతకు గురై హిమానీ నదం కరిగిపోవడానికి దారి తీస్తే ఆ లోటును హిమానీ నదం భర్తీ చేస్తుంది. ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు సరస్సు ఏర్పడడానికి వీలయ్యే మూడు లోతైన ప్రాంతాలను గుర్తించారు. ఈ సరస్సులు ఒక్కోటి 43 నుంచి 270 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పడే అవకాశం ఉందని తేల్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News