హైదరాబాద్: తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్‌సీసీ) ఎన్నికలపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ చూస్తుంటే సంతోషించాలో, ఏడ్వాలో తెలియట్లేదన్నారు. దేనికి పోటీపడుతున్నారో, ఎందుకు కొట్టుకుంటున్నారో అర్థం కావడం లేదని తమ్మారెడ్డి అన్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్ చూస్తే భయమేస్తోందన్నారు.
ఇది ఉన్నోడికి, లేనోడికి మధ్య జరుగుతున్న పోటీనా? అని తమ్మారెడ్డి ప్రశ్నించారు. మరోవైపు టీఎఫ్‌సీసీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా సాగుతోంది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్లో దిల్ రాజు, సి.కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. ప్రొడ్యూసర్ సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, స్టూడియో సెక్టార్ మరియు ఎగ్జిక్యూటివ్ సెక్టార్‌లోని ఓటర్లు తమ ఓటు వేయనున్నారు. మొత్తం 1600 మంది సభ్యులుంటే 900 ఓట్లు నమోదవుతాయని అంచనా. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై 6 గంటల తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు.