Friday, November 15, 2024

మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణే తక్షణ కర్తవ్యం

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: మణిపూర్‌లో దాదాపు మూడు నెలలుగా జాతులమధ్య రావణకాష్టంలాగా రగులుతున్న హింసాకాండను అదుపు చేయడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రతిపక్ష కూటమి‘ ఇండియా’కు చెందిన ఎంపీల బృందం పేర్కొంది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వహించడం పరిస్థితి పట్ల ఆయన పూర్తి ఉదాసీనతను చాటుతోందంటూ వారు మండిపడ్డారు. రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటిస్తున్న విపక్ష ఎంపీల బృందం ఆదివారం ఉదయం మణిపూర్ గవర్నర్ అనసూయ ఉయికీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో శాంతి, సుహృద్భావాన్ని తిరిగి నెలకొల్పడానికి అత్యవసరంగా బాధిత ప్రజలకు పునరావాసం, జీవనోపాధి కల్పించాలని ఈ సందర్భంగా గవర్నర్‌కు సమర్పించిన వినతిపత్రంలో వారు కోరారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కొనసాగుతున్న కాల్పులు, గృహదహనాలను బట్టి దాదాపు మూడు నెలలుగా కొనసాగుతున్న హింసాకాండను అదుపు చేయడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని స్పష్టంగా రుజువు అయిందని వారు ఆ వినతి పత్రంలో తెలిపారు.

మూడు నెలలుగా ఇంటర్నెట్ నిషేధాన్ని కొనసాగించడం నిరాధారమైన పుకార్లకు కారణమవుతోందని, వివిధ తెగల పట్ల ప్రస్తుతం ఉన్న అపనమ్మకానికి ఇది మరింత ఆజ్యం పోస్తోందని వారన్నారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వహించడం మణిపూర్ హింస పట్ల ఆయన ఉదాసీనతను చాటుతోందని కూడా వారన్నారు. దాదాపుగా అన్ని వర్గాల ప్రజల్లో ప్రభుత్వాల పట్ల ఆగ్రహం, తమను పరాయి వారిగా చూస్తున్నారన్న భావన ఉందని, దీన్ని వెంటనే తొలగించాల్సిన అవసరం ఉందన్నారు.‘ అన్ని పటిష్టమైన చర్యలు తీసుకొని రాష్ట్రంలో శాంతి, సామరస్యాన్ని తక్షణం పునరుద్ధరించాలని మేము మిమ్మల్ని వినమ్రంగా కోరుతున్నాం. బాధితులకు న్యాయం చేయడం అనేది దీనికి పునాదిగా ఉండాలి. రాష్ట్రంలో శాంతి , సామరస్యాన్ని పునరుద్ధరించడానికి బాధితప్రజలందరికీ ఎలాంటి జాప్యం లేకుండా పునరావాసం, జీవనోపాధి కల్పించడం అవసరం. గత 89 రోజులుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయనే విషయాన్ని కేంద్రప్రభుత్వానికి వివరించాలని కూడా మిమ్మల్ని కోరుతున్నాం.

దీనివల్ల వారు జోక్యం చేసుకుని రాష్ట్రంలో శాంతి సామరస్యాలను పునరుద్ధరించడానికి వీలవుతుంది’ అని ఎంపీలు గవర్నర్‌కు అందజేసిన వినతిపత్రంలో కోరారు. వినతిపత్రంపై బృందంలోని 21 మంది ఎంపీలు సంతకం చేశారు.శనివారం మణిపూర్ చేరుకున్న ఈ బృందం తొలి రోజు క్షణం తీరిక లేకుండా జరిపిన పర్యటనలో ఇంఫాల్, బిష్ణుపూర్ జిల్లాలోని మోయిరంగ్, చుర్‌చంద్‌పూర్‌లలోని పునరావాస కేంద్రాలను సందర్శించి అక్కడ తలదాచుకుంటున్న వందలాది మంది బాధితులను కలిశారు. బాధితుల్లో అటు గిరిజనులతో పాటుగా మెజారిటీ మెయిటీ తెగలకు చెందిన వారు కూడా ఉన్నారు. తాము గవర్నర్‌కు సమర్పించిన వినతిపత్రంలో బాధితులు తమతో పంచుకున్న ఆవేదన, కష్టాలకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయని ఎంపీలు తెలిపారు. సహాయక శిబిరాల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, ముఖ్యంగా చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉందని వారు తమ వినతిపత్రంలో పేర్కొన్నారు.

వివిధ సంస్కృతులకు చెందిన విద్యార్థులు అనిశ్చిత భవిష్యత్తును ఎదుర్కొంటున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. అనంతరం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తన ట్విట్టర్‌లో ఈ వినతిపత్రం కాపీని పంచుకుంటూ,ఈ విషయంలో ప్రధాని మోడీ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. మణిపూర్ ప్రజల ఆగ్రహం, ఆవేదన, బాధ, దుఃఖం, కన్నీళ్లు ఇవేవీ ప్రధానికి పట్టడం లేదంటూ మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News