సిటిబ్యూరోః అదుపు తప్పిన కారు భీభత్సం సృష్టించిన సంఘటన ట్యాంక్‌బండ్‌పై ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..ఇద్దరు యువకులు కారును వేగంగా నడుపుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ట్యాంక్‌బండ్ ఎన్‌టిఆర్ మార్గ్‌లో అదుపు తప్పి ఒక్కసారిగా ట్యాంక్‌బంబ్ రేలింగ్‌ను ఢీకొట్టి ఆగిపోయింది. కొంత ముందుకు వెళ్తే కారు మొత్తం హుస్సేన్‌సాగర్‌లో పడిపోయేది. కారులోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో అందులో ఉన్న ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు.
వెంటనే వారు కారును అక్కడే వదిలేసి పారిపోయారు. ప్రమాదం ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ఫుట్‌పాత్‌పై ఉన్న ఓ చెట్టు కూలిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో కారును అక్కడి నుంచి తరలించారు. అతివేగంతో రావడంతోనే కారు ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది. కారులో ఉన్న వారు మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.