Friday, November 22, 2024

చితికిన బతుకులకు బాసట

- Advertisement -
- Advertisement -

పునరావాస శిబిరాల్లో తలదాచుకున్న 5450మంది
కంటికి రెప్పలా కాపాడుతున్న సిబ్బంది
బాధిత ప్రాంతాలో ప్రత్యేక వైద్య శిబిరాలు
ర్యాపిడ్ రెస్పాన్స్ టీంల ఏర్పాటు
యుద్ధ ప్రాతిపాదికన పునరుద్ధరణ పనులు
బాధితులకు పదిరోజులకు సరిపడా నిత్యావసరాలు
ప్యాకెట్ల రూపంలో సరుకుల పంపిణీ

హైదరాబాద్ : భారీ వర్షాలు, గ్రామాలకు గ్రామాలనే ముంచెత్తిన వరదలతో పుట్టెడు కష్టాల్లో ప్రజానీకాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సహాయ, పునరావాస కార్యక్రమాల్లో తలమునకలయ్యింది. బురద మయమైన గ్రామాల్లోని ప్రజలకు తాగడానికి నీరులేక, తినడానికి అన్నంలేక, వండుకోవడానికి సరుకుల్లేక అష్టకష్టాలు పడుతున్న బాధితులను ఆదుకునేందుకు మంత్రలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, జిల్లాల పోలీస్ యంత్రాంగం మొత్తం ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. నీటిలోనే తేలియాడుతున్న గ్రామాలకు పడవలతో చేరుకొని ఒకవైపు నీటిలో చిక్కుకొన్న ప్రజలను రక్షిస్తూనే మరోవైపు ఇళ్ళు, భవనాలపైకి చేరుకొని ఆపన్న హస్తం కోసం దీనంగా ఎదురుచూస్తున్న ప్రజలకు తాగడానికి మంచినీరు, తినడానికి ఆహార పొట్లాలను అందిస్తూ రేయింబవళ్ళూ జనంతోనే కలిసిపోయి పనిచేస్తున్నారు.

ఇప్పటికే సుమారు 2.50 లక్షల మంది బాధితులను సహాయ, పునరవాస కేంద్రాలకు తరలించినట్లుగా అధికారవర్గాలు తెలిపాయి. అంతేగాక సహాయ, పునరావాస కేంద్రాల్లో బాధితుల కోసం భోజన ఏర్పాట్లు చేయడమే కాకుండా అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు వీలుగా వైద్య-ఆరోగ్యశాఖాధికారులు ప్రత్యేకంగా వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. వరదనీటిలో చిక్కుకొని పోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ములుగు జిల్లా మోరాంచపల్లి గ్రామంతో పాటుగా మరో 50 గ్రామాలు పూర్తిగా నీట మునగడంతో జిల్లాల్లోని ఎన్‌డిఆర్‌ఎఫ్, పోలీస్, అటవీశాఖ, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూశాఖ, విద్యుత్తుశాఖల అధికారులు, సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. సహాయ, పునరావాస కార్యక్రమాల్లో జిల్లాలకు చెందిన అధికారులు, సిబ్బంది చురుగ్గా పాల్గొనేందుకు వీలుగా కొన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఉద్యోగులు, పోలీస్‌లకు సెలవులను రద్దు చేశారు .

అదే విధంగా అత్యంత ప్రమాదకరంగా ప్రవహిస్తున్న గోదావరి నది వరద ప్రభావం నుంచి ప్రజలను కాపాడేందుకు భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా యంత్రాంగం, రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్, కలెక్టర్ ప్రియాంక ఆల, తదితరులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎత్తయిన, సురక్షితమైన ప్రాంతాలకు తరలించి బాధిత ప్రజలకు శిబిరాల్లోనే భోజనం ఏర్పాట్లు, వైద్య సదుపాయాలను కల్పించారు. అసలే వర్షాకాలం ఆపైన వ్యాధుల సీజన్ దీనికి తోడు వరదలు కూడ ముంచెత్తటంతో ఏమాత్రం అశ్రద్ద చేసినా అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచివుండటంతో ప్రభుత్వం అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య ఏర్పాట్లకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. వరద ప్రభావిత ప్రాంతాలకు రవాణాకష్టమైనప్పటికీ తగినంత బ్లీంచింగ్ పౌడర్ ప్యాకెట్లతోపాటు ,పాగింగ్ యంత్రాలను కెమికల్స్‌ను చేరవేస్తోంది. వైద్యశిబిరాల్లో అన్ని రకాల మందుటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. వదర ముంపునకు గురైన ఆవాసాల్లో మురుగునీరు బయటకు వేళ్లేలా చర్యలు చేపట్టారు. రోడ్ల వేంట పేరుకు పోయిన బరుదను తొలగించే పనులు ముమ్మరం చేశారు. బురదలో కూరుకుపోయిన మిషన్ భగీరధ పైప్‌లైన్లను శుబ్రం చేసి తిరిగి పరిశుభ్రమైన నీటిని అందించేవిధంగా పనులు చేస్తున్నారు. అన్నింటికీ మించి గ్రామాల్లో విద్యుత్ సదుపాయాన్ని వేగంగా పునరుద్దరిస్తన్నారు. విద్యుత్ సరఫరాలో షార్ట్ సర్యూట్‌లు ,ఇతర అంతరాయాలకు తావు లేనివిధంగా పకడ్బందీగా పనులు చేస్తున్నారు.
పదిరోజులకు సరిపడా నిత్యావసరాలు
వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను అన్ని విధాలా అదుకునేందుకు ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని పరుగులు తీయిస్తోంది. బాధితులకు బియ్యం వంటనూనెలు, పప్పు,ఉప్పు తదితర నిత్యావసర సరకులను పదిరోజులకు సరిపడా అందజేస్తోంది. అన్ని రకాల నిత్యావససరాలను ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేస్తోంది. వీటితోపాటు దుస్తులు, దుప్పట్లను కూడా పంపిణీ చేస్తోంది. క్యాన్ల రూపంలో తాగునీటిని కూడా అందజేస్తూ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా వుంటుందని వరదబాధిత కుటుంబాలకు ధైర్యం కల్పిస్తోంది.
యుద్ద ప్రాతిపదికన రోడ్ల పునరుద్దరణ
వరద ప్రభావిత ప్రాంతాల్లో జనజీవనం సాధారణ పరిస్థితులకు తెచ్చేందుకు ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. వరద ముంపు గ్రామాలకు వేళ్లే మార్గాల్లో దెబ్బతిన్న రోడ్లు , గుంతలకు రిపేర్లు చేయిస్తోంది. తెగిపోయిన కల్వర్టుల స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. వివిధ ప్రాంతాల్లోని పునరావాస సిబిరాల్లో 5450మంది బాధితులు తలదాచు కుంటున్నారు.లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టడంతో శిబిరాల్లో తలదాచుకున్న బాధితుల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్లిపోవాలన్న ఆదుర్ధా పెరుగుతోంది. ఆ మేరకు తమను పంపించాలని శిబిరాలను పర్యవేక్షిస్తున్న అధికారులపై కూడా బాధితులనుంచి వత్తిళ్లు పెరుగుతున్నాయి. దీంతో నిత్యావసర సరకులు ఇతర సామాగ్రిని శిబిరాల వద్దనే అందజేసి వారిని సురక్షితంగా ఇళ్లకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
బాధితులను ఆదుకుంటున్న దాతలు
వరదల్లో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన బాధితులను ఆదుకునేందుకు దాతలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. బాధితులకు నగదు, బియ్యం , ఇతర ఆహారాపదార్దాలు ,దుస్తులు తదితర వాటిని అందజేస్తున్నారు. మోరంచ పల్లి బాధితులకు ప్రారంభంలోనే ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితోపాటు ఆయన సోదరులు రూ.10లక్షలు నగదు పంపిణీ చేశారు. సింగరేణి కార్మిక సంఘాలు కూడా తమ వరద బాధితుల పట్ల తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నాయి.కార్మిక సంఘాల్లోని 5427మంది కార్మికులు ఒక్కొక్కరూ వెయ్యి రూపాయల వంతున ఈ నెల జీతం నుంచి వేతన రికవరీని ప్రకటించారు. ఈ మొత్తాన్ని బాధితులకు అందజేయనున్నారు.సేవ్ ద లైఫ్ సంస్థ తాగునీరు, ఆల్పాహారం , మద్యాహ్నం భోజనం సమకూరుస్తోంది. పలు స్వచ్చంద సంస్థలు ,దాతలు వరద ప్రభావిత ప్రాంతాల్లో నిర్వాసితులను అదుకునేందుకు ముందుకొస్తున్నారు
కాలినడకనే వాగులు వంకలు దాటుకుని వెళుతున్న మంత్రి సత్యవతి
అపదలో ఉన్న వారికి అపన్న హస్తం అందించి వారిలో ధైర్యం కల్పించేందుకు రాష్ట్ర గిరిజన , స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఆదివారం కూడా మంత్రి ములుగు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. గ్రామాల్లో ఇంటింటింకి వెళ్లి బాధితలను పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాల ఆండగా నిలిచి ఆదుకుంటుందని ధైర్యం చెప్పారు. బండారు పల్లిలోని రాళ్లకుంట వాగు వద్ద రోడ్డు పనులు పరిశీలించారు. బూర్గంపేట వద్ద కూడా రొడ్దు పనులు పరిశీలించారు. రోడ్డు మార్గం లేకపోయనా ,అధికారులు అభ్యంతరం చెబుతున్నా లెక్క చేయకుండా నడుచుకుంటూనే బాధితుల వద్దకు వెళుతున్నారు. భూర్గంపేట చెరువు కట్ట తెగి వరద నీటిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందటంతో కాలినడకనే వెళ్లి అతి కష్టం మీద ఆ కుటుంబ సభ్యులను కలిశారు.అన్ని విధాల ఆదుకుంటామని వారికి ధైర్యం కల్పించారు. ములుగు జిల్లాలో మేడారం ,నార్లపూర్ ,ఉరటం , కొండాయి ,మల్యాల , దొడ్ల గ్రామాలకు చెందిన వరద భాధితులకు ప్రభుత్వం అన్ని విధాల ఆండగా నిలిచింది. శరవేగంగా సహాయ చర్యలు చేపట్టింది.
శాంతించిన గోదావరి 52అడుగులక నీటిమట్టం
ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తెరిపి నిచ్చాయి. గోదావరి నదీపరివాహంగా వాగులు వంకల్లో వరదనీటి ఉధృతి తగ్గూతూ వస్తోంది. గోదావరి నది శాంతించింది. భద్రాచలం వద్ద గోదావరి నదిలో నీటిమట్టం 52అడుగులకు తగ్గింది. నదిలో 14.04లక్షల క్యూసెక్కుల వరదనీరు ప్రవహిస్తోంది. అధికారులు మూడవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అయినప్పటికీ భద్రాచలం పట్టణం ఇంకా భయం గుప్పిట్లోనే ఉంది . మరపడవలు , లైఫ్ జాకెట్లతో ఎన్‌ఢిఆర్‌ఎఫ్ బృందాలు అక్కడే ఉన్నాయి. ఆర్మీ హెలికాప్టర్‌ను కూడా అందుబాటులోనే ఉంచారు. మంత్రి పువ్వాడ అజయ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరద సహాయక, పునరావాస సమీక్షలతో అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News