80టిఎంసీలకు పెరిగిన నీటినిల్వ
హైదరాబాద్ : నదీ పరివాహకంగా ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీవర్షాలతో కృష్ణానదికి వరద ఉధృతి పెరిగింది. ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 2.26లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. రోజుకు 20టిఎంసీలకు పైగా నీరు చేరుతోంది. ఆదివారం నాటికి శ్రీశైలం జలాశయంలో నీటినిలువ 80టిఎంసీలకు పెరిగింది. మరోవైపు గోదావరిలో ఎగువ నుంచి నీటి ప్రవాహాలు తగ్గుముఖం పట్టాయి. మహారాష్ట్ర నుంచి శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి 8100క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటినిలువ గరిష్ట స్థాయికి చేరువగా 84టిఎంసీలకు పెరిగింది.
మంజీరా నదిలో కూడ వరద ఉధృతి తగ్గింది. సింగూరు ప్రాజెక్టులోకి 10663క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటి నిలువ గరిష్ట స్థాయికి చేరవయింది. నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా నిండుకుండాలా మారింది. ఈ ప్రాజెక్టులోకి 4800క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాణహిత నది వరద ఉధృతి కాస్త తగ్గింది. మేడిగడ్డ వద్ద లక్ష్మీబ్యారేజ్‌లోకి 5.71లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా అంతే నీటిని గేట్ల ద్వారా దిగువకు వదిలిపెడుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరిలో నీటి ప్రవాహం 13.31లక్షలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. నదిలో నీటిమట్టం 52అడుగులకు తగ్గింది.