Saturday, December 21, 2024

చేతి వృత్తులు ఉత్పత్తి కేంద్రాలు కావాలి

- Advertisement -
- Advertisement -

సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్

హైదరాబాద్ : కులవృత్తులను ఆధునీకరించుకోవాలని అందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఙానాన్ని అందించాలన్న బృహత్తర ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. చేతివృత్తులను ఆధునీకరించుకోగలిగితే పోటీ ప్రపంచంలో నిలబడడమేగాకుండా ఉత్పత్తి రంగాన్ని కూడా అభివృద్ధి చేసుకోవచ్చుననే తలంపుతోనే సిఎం కేసీఆర్ బీసీలకు లక్షరూపాయలు అందించే పథకం చేపట్టారని పేర్కొన్నారు. బీసీల జీవనప్రమాణాలు పెంచేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. ఎల్.బీ.నగర్ లోని భాగ్యనగర్ ఫంక్షన్ హాలులో ఆదివారం విశ్వకర్మల వివాహ పరిచయవేదిక కార్యక్రమానికి జూలూరు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో సగానికి పైగా వున్న బీసీల జీవితాల్లో వెలుగులు నిండితేనే రాష్ట్రాభివృద్ధి వేగవంతంగా జరుగుతుందన్న ఆలోచన కేసీఆర్‌కు ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే సంపద పెంచాలి-..సంపద పంచాలి అన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. బీసీల కోసం రాష్ట్రప్రభుత్వం అందించే ఒక లక్ష రూపాయల సాయం నిరంతరంగా కొనసాగుతుందన్నారు. చేతివృత్తుల వారికి అందించే ఈ సాయం వల్ల బీసీల జీవనప్రమాణాలు పెరిగే అవకాశం ఉందన్నారు. చేతివృత్తుల్ని ఆధునీకరిస్తే ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతాయని వాటిని దేశవిదేశాలకు ఎగుమతులు చేస్తే బహుజనులు బలమైన శక్తులుగా ఎదుగుతారని తెలిపారు.

వ్యవసాయానికి నాగలిని, ఇంటికి గడపను, గృహనిర్మాణానికి ముగ్గులు పోసిన నాగరిక సమాజానికి నాంది పలికిన విశ్వకర్మలు సాంకేతిక విజ్ఞాన విప్లవాలను సొంతం చేసుకుని రాష్ట్రాభివృద్ధిలో దేశపురోగతిలో కీలకపాత్ర పోషించే దశకు ఎదగాలన్నారు. విశ్వకర్మలు సంపదను పెంచే శక్తులుగా ఎదగాలన్న ధ్యేయంతోనే కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారని తెలిపారు. ఒకనాటి పాత హైదరాబాద్ రాష్ట్రంలో అత్యధిక అక్షరాస్యులుగా విశ్వబ్రాహ్మణులు నిలిచారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విశ్వబ్రాహ్మణులకు చేయూత కరువైందని, అత్యధికంగా ఆత్మహత్యలు జరిగాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విశ్వబ్రాహ్మణుల జీవనప్రమాణాలు పెంచేదుకు కృషి ముమ్మరంగా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అడ్లూరి రవీంద్రాచారి, తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవ భవనం ట్రెజరర్ రవీంద్రాచారి, అప్పగిరి చెలిమోజు సిఐ మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

Vishwakarma

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News