లక్నో: వారణాసి, మథుర ఆలయాల వివాదంపై సమాజ్‌వాది పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్వామి ప్రసాద్ మౌర్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి మసీదులో ఆలయం కోసం బిజెపి వెదికితే ప్రజలు ప్రతి ఆలయంలో బౌద్ధ ఆరామం కోసంబౌద్ధులు వెదకడం ప్రారంభిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.
ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలు, పూరీలోని జగన్నాథ ఆలయం, కేరళలోని అయ్యప్ప ఆలయం, పండర్‌పూర్‌లోని విళోబా ఆలయం(మహారాష్ట్ర) బౌద్ధ ఆరామాలేనని మౌర్య తెలిపారు. ఈ బౌద్ధ ఆరామాలను కూల్చివేసి ఆ ప్రదేశంలో హిందూ ఆలయాలు వెలశాయని ఆయన అన్నారు. 8వ శతాబ్దం వరకు అవన్నీ బౌద్ధ ఆరామాలేనని ఆదివారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ మౌర్య చెప్పారు. ఈ ఆలయాలన్నీ ఒకప్పుడు బౌద్ధ ఆరామాలేనని చెప్పడానికి చారిత్రక ఆధారాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన తెలిపారు.
ఈ ఆలయాలను తిరిగి బౌద్ధ క్షేత్రాలుగా మార్చడం తన ఉద్దేశం కాదని, ప్రతి మసీదులో ఆలయం కోసం మీరు వెదికితే ప్రతి ఆలయంలో బౌద్ధ ఆరామం కోసం బౌద్ధులు ఎందుకు వెదకరని బిజెపిని ఉద్దేశిస్తూ ఆయన ప్రశ్నించారు. కుట్రపూరితంగానే బిజెపి నాయకులు మసీదు-ఆలయ వివాదాన్ని లేవనెత్తుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రది ఆలయంలో మసీదు కోసం వెదుకుతున్న బిజెపి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.
ఇదిలా ఉండగా&బౌర్య వ్యాఖ్యలను ఉత్తర్ ప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి తీవ్రంగా ఖండించారు. సనాతన హిందూ ధర్మాన్ని పదేపదే అవమానించడం సమాజద్‌వాది పార్టీ నాయకులకు అలవాటుగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. బాబా కేదార్‌నాథ్, బద్రీనాథ్, పూరీ జగన్నాథ ఆలయాలపై మౌర్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమే కాక ఆయన అల్ప బుద్ధికి, నీచ రాజకీయాలకు నిదర్శనమని బిజెపి చీఫ్ ఆరోపించారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మౌర్య వ్యాఖ్యలు ఉన్నాయని, సమాజంలో ద్వేషభావం ప్రబలిపోయే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. మౌర్య తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.