Sunday, December 22, 2024

ఎన్నికల హామీలను నెరవేర్చని బిఆర్‌ఎస్ ప్రభుత్వం: కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ : ఎన్నికల సమయంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏవి నెరవేర్చలేదని బిజెపి రాష్ట్ర చీఫ్ కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని ప్రజలకు మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కెసిఆర్ తొమ్మిదేళ్లు గడిచిన తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తన కుటంబాన్ని బంగారు కు టుంబంగా మార్చుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలందరికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం డబల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పాలమూరు కేంద్రంగా ప్రజాపోరు పేరుతో బిజెపి శ్రేణులు జిల్లా కేంద్రంలో ఆర్‌అండ్‌బి అతిథి గృహం నుంచి గడియారం చౌరస్తా వరకు మహా ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా పాలమూరు గడ్డపై నుంచి పోరు యాత్రకు శ్రీకారం చుట్టిన కిషన్‌రెడ్డికి జిల్లా బిజెపి శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు.

ఆర్‌అండ్‌బి అతిథి గృహం నుంచి ర్యాలీ మొదలై బస్టాండ్ మీదుగా గడియారం చౌరస్తా వరకు కొనసాగింది. అంతకు ముందు కిషన్‌రెడ్డి అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గడియారం చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసిఆర్ నియంతపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద నాలుగు కోట్ల ఇండ్లు మంజూరు చేసిందని, తెలంగాణలో సీఎం కేసిఆర్ డబుల్ బెడ్ రూంల పేరుతో నిరుపేదలను మభ్యపెట్టి ఏ ఒక్కరికి డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయలేదని ఎద్దేవా చేశారు. అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వకుండా ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వచ్చిన రేషన్ కార్డులు తప్ప తెలంగాణ ఏర్పడ్డాక ఏ ఒక్క నిరుపేదకు రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ప్రశ్నించారు.

బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి. కె. అరుణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లు పేదలందరికి ఇవ్వాలని ఉద్దేశంతో బిజెపి పోరుబాట పట్టిందని తెలిపారు. బిజెపితోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో బిజెపిని అధికారంలోకి తీసుకరావటానికి కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు జితేందర్‌రెడ్డి, పి. చంద్రశేఖర్, నాగురావు నామాజీ, పద్మజారెడ్డి, ఆచారి, జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి, ఎన్. పి. వెంకటేష్, శ్రీనివాస్‌రెడ్డి, పాండురంగారెడ్డి, ఇద్దరి నర్సిములు, కొండయ్య, ఇతర జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News