Monday, December 23, 2024

యాదాద్రిలో మార్చురీలో మృతదేహాన్ని కొరికిన ఎలుకలు

- Advertisement -
- Advertisement -

మార్చురీలో ఉంచిన మృతదేహాన్ని ఎలుకలు కొరికిన ఉదంతం పై పలువురు ఆగ్రహం

బయటకు పొక్కకుండా ప్రయత్నించిన ఆసుపత్రిసిబ్బంది. సిబ్బంది నిర్వాకంపై బంధువులు ఆగ్రహం

మనతెలంగాణ/ యాదాద్రి భునగిరి ప్రతినిధి: మార్చురీలో ఉంచిన మృతదేహాన్ని ఎలుకలు కొరికిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి మార్చురీలో ఉంచిన మృతదేహం ముఖం, చెంపలు, నుదిటిపై ఎలుకలు కొరికిన గాట్లు ఉండటంతో మృతదేహాన్ని ఎలుకలు కొరికాయని మృతుని బంధువులు అనుమానిస్తున్నారు. ఐతే ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ఆసుపత్రి సిబ్బంది యత్నించారు. పోలీసులు తీసిన ఫోటోలలో గాట్లు ఉండటంతో నిర్లక్ష్యం వహించి, జరిగిన సంఘటనను బయటకు పొక్కకుండా ఉండేందుకు సిబ్బంది చేసిన నిర్వాకంపై బంధువులు, కుంటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం బాయపాలెం గ్రామానికి చెందిన పెరికల రవికుమార్‌ (38) కుటుంబం 2016లో భువనగిరికి వలస వచ్చాడు. రవికుమార్‌కు మొదటి భార్యకు పుట్టిన ఒక కూతురు ఉంది. కొంత కాలానికి ఆమె చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు.

ఏడాది క్రితం రెండో భార్య రవికుమార్‌ను వదిలివెళ్లింది. దీంతో ఆయన తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి పట్టణంలోని ప్రగతినగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తున్న రవికుమార్‌ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. భార్యా భర్తలు తగాదా పడుతుండడంతో తల్లిదండ్రులు, పిల్లలు సమీపంలోని తెలిసిన వారి ఇంటికి వెళ్లారు. తిరిగి రాత్రి 11:30 నిమిషాలకు ఇంటికి వచ్చేసరికి రవికుమార్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మార్చురీ గదిలోని ఫ్రీజర్‌లో కాకుండా బయట భద్రపరిచారు.

ఐతే రవికుమార్‌ మృతదేహాన్ని చూసేందుకు సోమవారం ఉదయం కుటుంబసభ్యులతో పాటు బంధువులు మార్చురీకి వచ్చారు. అప్పటికే మృతదేహం ముఖం, చెంపలు, నుదుటిపై ఎలుకలు కొరికిన గాట్లు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఎలుకలు కొరికినట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ చిన్నానాయక్‌ తెలిపారు. కాగా డెడ్ బాడీని మార్చురీకి తీసుకెళ్లిన సమయంలో ముఖంపై ఎలాంటి గాయాలు, గాట్లు కనిపించలేదని భవనగరి టౌన్ ఇన్ స్పెక్టర్ సుధీర్‌కృష్ణ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News