న్యూఢిల్లీ: మణిపూర్‌లో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని, ఆ రాష్ట్రంలో జరుగుతున్న ఘర్షణలపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిన సిఫార్సులతో కూడిన నివేదికలో ఢిల్లీ మహిళా కమిషన్(డిసిడబ్ల్యు) పేర్కొంది.
ఈ ఏడాది మే నుంచి మణిపూర్‌లో రెండు జాతుల మధ్య జరుగుతున్న ఘర్షణల బాధితులను కలుసుకునేందుకు డిసిడబ్లు చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ గత వారం మణిపూర్‌లో పర్యటించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న హింసాకాండను, అక్కడ రెండు వర్గాల ప్రజల మధ్య ఏర్పడిన వైషమ్యాలను దృష్టిలో పెట్టుకుని మణిపూర్‌లో తక్షణమే రాజ్యాంగంలోని 356వ అధికరణను ప్రయోగించాలని డిసిడబ్ల్యు తన నివేదికలో రాష్ట్రపతిని కోరింది.
రెండు వర్గాలకు చెందిన ప్రజలు నమ్మే తటస్త వ్యక్తుల ఆధ్వర్యంలో పాలనాయంత్రాంగం నడవాల్సిన అవసరం ఉందని కమిషన్ పేర్కొంది. మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, జాతుల మధ్య ఘర్షణలు, ప్రభుత్వ స్పందనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్‌తో దర్యాప్తు చేయించాలని కమిషన్ తన మధ్యంతర సిఫార్సులతో కూడిన నివేదికలో కోరింది. వీటితోపాటు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు వెంటనే రాష్ట్రాన్ని సందర్శించాలని కూడా నివేదికలో కోరారు.