న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై విపక్ష నేతల ఆవేదనను ఆలకించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన విజ్ఞప్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంగీకరించారు. మణిపూర్ అంశంపై చర్చించేందుకు బుధవారం మధ్యాహ్నం 11.30 గంటలకు విపక్ష ఎంపీలతో సమావేశమయ్యేందుకు ఆమె సమయం కేటాయించారు. గత రెండు నెలలుగా మణిపూర్ హింసాకాండతో అట్టుడుకుతుండగా, ఈశాన్య రాష్ట్రంలో హింసాండపై చర్చించేందుకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటినుంచీ విపక్షాలు ఉభయసభల్లోను పట్టుబడుతూ ఉన్నాయి.
మణిపూర్ అంశంపై పార్లమెంటు వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయాలని కూడా విపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మణిపూర్‌లో క్షేత్రస్థాయి పరిస్థితిని మదింపు చేసేందుకు విపక్షాలకు చెందిన ఎంపీలు ఇటీవల రెండు రోజుల పాటు ఆ రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే. మణిపూర్‌లో పరిస్థితులను చక్కదిద్దేందుకు జోక్యం చేసుకోవాలని విపక్షాలు రాష్ట్రపతిని కోరుతున్నాయి.