ముంబై : మహారాష్ట్ర థానే జిల్లా లోని షాపూర్ సమీపంలో జరుగుతున్న సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం మూడో దశ పనుల్లో సోమవారం అర్ధరాత్రి దాటాక ఘోర ప్రమాదం జరిగింది. ముంబైకి 80 కిమీ దూరంలో సార్లంబే గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. బ్రిడ్జిల నిర్మాణానికి ఉపయోగించే గిర్డర్ లాంచర్ దాదాపు 35 మీటర్లు (114 అడుగులు) ఎత్తు నుండి కుప్పకూలడంతో పది మంది కార్మికులతోపాటు మొత్తం 17 మంది మృతి చెందారు.
మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గిర్డర్ లాంచర్‌తోపాటు 700 టన్నుల బరువున్న క్రేన్ కూలిపోవడంతో కార్మికులు ముగ్గురు కార్మికులు భయంతో చిక్కుకున్నారని మహారాష్ట్ర రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ( ఎంఎస్‌ఆర్‌డిసి ) ప్రకటించింది. మృతుల్లో పది మంది కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు, ఐదుగురు ఉద్యోగులు ఉన్నారని ఈ ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్న ఎంఎస్‌ఆర్‌డిసి వివరించింది. ఆటోమేటిక్ లాంచర్‌ను తొలగించే పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. గిర్డర్ లాంచర్ కుప్పకూలడం కేవలం నిర్లక్ష్యం వల్ల జరిగిందని ఆరోపిస్తూ ఇద్దరు కాంట్రాక్టర్లపై థానే జిల్లా పోలీస్‌లు కేసు నమోదు చేశారు. గాయపడిన ముగ్గురికి థానే లోని కల్వవద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సిఎం దేవేంద్ర ఫడ్నవిస్, ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వెలిబుచ్చారు. దీనిపై దర్యాప్తుకు ఆదేశించారు. ముఖ్యమంత్రి షిండే మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ప్రధాని మోడీ తీవ్ర సంతాపం …
ప్రధాని మోడీ ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. రూ. 2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేలు వంతున ఆర్థిక సాయం ప్రకటించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తన సంతాపాన్ని తెలియజేస్తూ నేషనల్ డైసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్ ) బృందాలు రిస్కూ కార్యక్రమాలు చేపట్టాయని చెప్పారు.