హైద్రాబాద్, గుంటూరులలో సోదాలు
ట్రాన్స్‌స్ట్రాయ్ డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సోదాలు కలకలం రేపుతున్నాయి. ట్రాన్స్‌స్ట్రాయ్ సంస్థకు చెందిన కార్యాలయాలు, ఆ సంస్థకు చెందిన డైరెక్టర్ల నివాసాల్లో ఇడి అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. తెలంగా ణలోని హైద్రాబాద్‌తో పాటు ఎపిలోని గుంటూరులలో కూడ ఇడి అధికారులు తనిఖీలు చేప ట్టారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 15 చోట్ల ఇడి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ట్రాన్స్‌స్ట్రాయ్ సంస్థకు చెందిన మలినేని సాంబశివరావు, మాజీ ఎంపి రాయపాటి సాంబశి వరావు నివాసాలతో పాటు ఆ సంస్థకు సంబంధించిన కార్యాలయాలు, ఆ సంస్థ డైరెక్టర్ల నివాసాల్లో ఇడి అధికారులు సోదాలు నిర్వహించారు. హైద్రాబాద్ లోని జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్టల్లో ఇడి అధికారులు తనిఖీలు నిర్వహించారు.
గతంలో ఈ ట్రాన్స్‌స్ట్రాయ్ కంపెనీ వివిధ బ్యాంకుల్లో 9 వేల కోట్లపైగా రుణాలు తీసుకొని మళ్లించినట్టు సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ డబ్బును డొల్ల కంపెనీల పేరుతో అక్రమాలకు పాల్పడ్డట్టు సిబిఐ నమోదు చేసిన కేసు ఆధారంగానే ఇడి ఎంట్రీ ఇచ్చి కేసు నమోదు చేసింది. ఇందులో జరిగిన మనీలాండరింగ్‌పై ఆరాలు తీస్తోంది. ఈ విషయమై బ్యాంకుల నుండి అందిన ఫిర్యాదు మేరకు సిబిఐ కేసు నమోదు చేసింది. యూనియన్ బ్యాంక్ నుండి రూ. 300 కోట్ల రుణాలు తీసుకొని ఎగవేసిందని ఆరోపణలున్నాయి. రూ. 260 కోట్లను వేరే కంపెనీలకు మళ్లించినట్టుగా ఆరోపణలున్నాయి. బ్యాంకు నుండి రుణం తీసుకున్న డబ్బులతో బంగారు ఆభరణాలు తీసుకున్నట్టుగా ఆరోపణలున్నాయి. 2013లో ఆడిట్ సమయంలో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. అప్పటి నుండి బ్యాంక్ లిస్టులో నిరర్ధక ఆస్తిగా ఈ రుణాలున్నాయి. 2020 సిబిఐ అధికారులు ఈ సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ట్రాన్స్‌స్ట్రాయ్ సంస్థ డైరెక్టర్లపై కేసులు నమోదు చేశారు.
పోలవరం ప్రాజెక్టుతో పాటు రోడ్డు నిర్మాణాల ప్రాజెక్టుల నిర్మాణం కోసం తెచ్చిన నిధులను ఇతర అవసరాలకు ఉపయోగించారని ట్రాన్స్‌స్ట్రాయ్ సంస్థపై దర్యాప్తు సంస్థలు ఆరోపణలు చేస్తున్నాయి. 2020 జనవరి లో ట్రాన్స్‌స్ట్రాయ్ సంస్థలో సిబిఐ అధికారులు సోదాలు చేశారు. కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, సౌత్ ఇండియా బ్యాంక్ నుండి భారీగా రుణాలు తీసుకున్నారని ఆరోపణలున్నాయి. 2016 జూలై నుండి 2022 డిసెంబర్ వరకు ట్రాన్స్ స్ట్రాయ్ సంస్థలో డైరెక్టర్ గా రాయపాటి సాంబశివరావు కొనసాగారు. 2017 ఏప్రిల్ 18 వరకు మలినేని సాంబశివరావు ట్రాన్స్‌స్ట్రాయ్ కంపెనీకి డైరెక్టర్ గా ఉన్నారు. ఈ కంపెనీకి 2022 సెప్టెంబర్ 15న ఎండి చెరుకూరి శ్రీధర్ కంపెనీ నుండి బయటకు వచ్చారు. ఈ విషయమై నమోదైన సిబిఐ కేసు ఆధారంగా ఇడి రంగంలోకి దిగింది. ఈ విషయమై ఇడి అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. కాగా, పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు ట్రాన్స్‌స్ట్రాయ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మొదట కాంట్రాక్టర్‌గా ఉంది. ఈ ఈ కేసులో నిందితులు నిధు లను దారి మళ్లించేందుకు పనిమనిషి, స్వీపర్లు, డ్రైవర్ల పేర్లను డైరెక్టర్లుగా ఉపయోగించుకుని బోగస్ కంపెనీలను సృష్టించారని ఇడి ఆరోపిస్తుంది. సిబిఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఇడి మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది.
13 బ్యాంకుల నుంచి రూ.9,394 కోట్ల రుణం
నిందితులు పద్మావతి ఎంటర్‌ప్రైజెస్, యూనిక్ ఇంజినీర్స్, బాలాజీ ఎంటర్‌ప్రైజెస్, రుత్విక్ అసోసియేట్స్ వంటి సంస్థలను స్థాపించి, వాటి ద్వారా రూ.6,643 కోట్లు స్వాహా చేసినట్లు ఇడి దర్యాప్తులో తేలింది. కెనరా బ్యాంకుతో పాటు మరో 13 బ్యాంకుల నుంచి ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ రూ.9,394 కోట్ల రుణం పొందినట్లు ఫోరెన్సిక్ ఆడిట్ వెల్లడించింది. నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, డాక్యుమెంట్ల తప్పుడు సమాచారం, ఉల్లంఘనల కింద ట్రాన్స్‌స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్, కంపెనీ సిఎండి చెరుకూరి శ్రీధర్, మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు, అక్కినేని సతీష్‌లపై సిబిఐ గతంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. తొమ్మిది మందికి ట్రాన్స్‌స్ట్రాయ్ ఖాతా నుంచి రూ.7,153 కోట్లు బదిలీ అయినట్లు ఆడిట్ వెల్లడించింది. ఈ మొత్తంలో ఎనిమిది మంది విక్రేతల నుంచి రూ.6,202 కోట్లు ట్రాన్స్‌స్ట్రాయ్ ఖాతాకు తిరిగి వచ్చాయి. మిగిలిన డబ్బు సంబంధిత పార్టీలు, స్పెషల్ పర్పస్ వెహికల్స్, ఇతరులకు మళ్లించారని ఇడి అభియోగిస్తుంది. ప్రమోటర్ల ఖాతాల్లోకి అదనంగా రూ.350 కోట్లు బదిలీ అయ్యాయని ఇడి పేర్కొంది.
ఫెమా నిబంధనలు ఉల్లంఘనలు
ట్రాన్స్‌స్ట్రాయ్ కంపెనీని 2001లో స్థాపించారు. సివిల్ కాంట్రాక్టులు, రోడ్లు, వంతెనలు, సొరంగాలు, హైవే నిర్మాణాలను ఈ సంస్థ చేపడుతోంది. ఈ కంపెనీ 2013, 2014లో కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సహా బ్యాంకుల కన్సార్టియం నుంచి పెద్ద మొత్తంలో ట్రాన్స్‌స్ట్రాయ్ రుణాలు పొందింది. రుణాల ఎగవేతకు సంబంధించి బ్యాంకుల కన్సార్టియం నేష నల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. అక్టోబర్ 10, 2018లో ఎన్‌సిఎల్‌టి హైదరాబాద్ బెంచ్ పిటిషన్‌ను అంగీకరించింది. 2018 అక్టోబర్ నాటికి వివిధ ఆర్థిక, కార్యాచరణ సంబంధించి బ్యాంకులు రూ. 8,630 కోట్ల విలువైన క్లెయిమ్‌లు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. విదేశీ మారకపు లావాదేవీల్లో అక్రమాలకు సంబంధించి ట్రాన్స్‌స్ట్రాయ్‌పై కొనసాగుతున్న ఫెమా కేసుతో పాటు, సిబిఐ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా పిఎంఎల్‌ఎ కింద మూడో కేసును ఇడి దర్యాప్తు చేస్తోంది. సిబిఐ విచారణలో కంపెనీ నిల్వలు, బ్యాలెన్స్ షీట్లు పెంచిన ఉదంతాలు బయల్పడ్డాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ట్రాన్స్‌స్ట్రాయ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ట్రాన్స్‌స్ట్రాయ్ సింగపూర్ పిఇటి లిమిటెడ్‌కు బ్యాంకుల అనుమతి లేకుండానే 2013-14లో రూ.15.34 కోట్లు బదిలీ చేసినట్లు ఫెమా కేసు వెల్లడి చేసింది.