హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకు లైసెన్సుదారుల ఎంపికకు సంబంధించి ఆబ్కారీ శాఖ బుధవారం నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రస్తుత మద్యం దుకాణాల లైసెన్సుల గడువు నవంబర్ 30వ తేదీ నాటికి ముగియనుంది. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మద్యం దుకాణాల ఏర్పాటుకు కొత్త లైసెన్సులను లాటరీ ద్వారా మంజూరు చేస్తారు. ఈసారి దరఖాస్తుల రుసుమును రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షలుగా నిర్ణయించింది.
ఈ నెల 3న జిల్లాల వారీగా నోటిఫికేషన్ ఇవ్వనున్న ప్రభుత్వం.. 4వ తేదీ నుంచి 18 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆగస్టు 21న డ్రా ద్వారా మద్యం దుకాణాల లైసెన్సులు జారీ చేస్తారు. గత నోటిఫికేషన్లో తిరిగి ఇవ్వని దరఖాస్తు ఫీజు కింద రూ.1.350 కోట్లు. దుకాణాల లైసెన్స్ ఫీజు కింద దాదాపు రూ.3.500 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఈ సారి కూడా అంతే మొత్తం వచ్చే అవకాశం ఉందని ఆబ్కారీ శాఖ అంచనా వేస్తోంది.
రెండు నెలల ముందే లైసెన్సుల జారీ..
రాష్ట్రంలో రెండు నెలల ముందే మద్యం దుకాణాల లైసెన్సులు జారీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 2021లో మాదిరిగానే ఈసారి కూడా దరఖాస్తుల విక్రయాల ద్వారా 15 వందల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆబ్కారీ శాఖ భావిస్తుంది. 2021లో నూతన మద్యం పాలసీలో భాగంగా రాష్ట్రంలో కొత్తగా 404 మద్యం దుకాణాలు పెరగడంతో రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్య 2,216 నుంచి 2,620 చేరాయి. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త దుకాణాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త మద్యం దుకాణాల్లో భాగంగా గౌడ్‌లకు 15 శాతం, దళితులకు 10 శాతం, గిరిజనులకు 5 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం కేటాయించింది.
కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు లాటరీ ద్వారా మద్యం దుకాణాలను ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో గౌడ్‌లకు 363, దళితులకు 262, గిరిజనులకు 131 కలిపి మొత్తం 756 మద్యం దుకాణాలను రిజర్వేషన్ల ప్రతిపాదికన కేటాయించగా.. మిగిలిన 1864 మద్యం దుకాణాలను జనరల్ కేటగిరిలో ఉంటాయని అధికారులు వెల్లడించారు. 2021లో మద్యం దుకాణాలకు ఆబ్కారీ శాఖ ఆహ్వానించగా.. దరఖాస్తు రూపంలో రూ.1357 కోట్ల ఆదాయం రాగా.. సుమారు 67,849 దరఖాస్తులు వచ్చాయి. సగటున ప్రతి దుకాణానికి దాదాపు 26 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది.