మన తెలంగాణ/సిటీ బ్యూరో: జిహెచ్‌ఎంసిలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు ఊదరి గోపాల్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తామంటూ నాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిహెచ్‌ఎంఈయూ ఆధ్వర్యంలో జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఎంట్రెన్స్ వద్ద బుధవారం కార్మికులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా తమను పర్మినెంట్ చేసి నాడు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలంటూ కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్బంగా యూనియన్ అధ్యక్షులు ఊదరి గోపాల్ మాట్లాడుతూ ”సఫాయామ్మా, సలామమ్మా” అంటూ నెత్తినెత్తుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కేవలం మాటాలతోనే సరిపెట్టడం కాదని నాడు ఉద్యమ సమయంలో ఇచ్చినా హామీ నేరవేర్చి మాట నిలబెట్టుకోవాలని కోరారు. లేకపోతే మెరుపు సమ్మెకు తప్పదంటూ ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ధర్నా సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కార్మికులకు నచ్చజెప్పేందుకు యత్నించినా వారు వినకపోవడంతో గోపాల్ తో పాటు పలువురుని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.