Wednesday, January 22, 2025

చైనా తైవాన్ మాల్‌కు ఇక చెక్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ట్యాబ్‌ల దిగుమతులపై ఆంక్షలు విధించింది. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని అధికారికంగా ప్రకటించారు. పర్సనల్ కంప్యూటర్ల వంటివాటిపై ఈ దిగుమతి ఆంక్షలు అమలులోకి వస్తాయి. ఇప్పటివరకూ చైనా , తైవాన్ ఇతర దేశాల నుంచి ఎక్కువగా ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లను తెప్పించుకుంటున్నారు. ఇవి ఇక్కడి మార్కెట్‌లలో అమ్ముడుపోతున్నాయి. ఇప్పుడు దిగుమతులపై ఆంక్షలతో స్వదేశీ ఉత్పత్తి రంగానికి ఊతం ఇచ్చినట్లు అవుతుంది. ప్రత్యేకించి చైనా సరుకులకు చెక్ పడుతుంది. దిగుమతులపై ఆంక్షల నోటిఫికేషన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్(డిజిఎఫ్‌టి) వెలువరించింది.

అయితే కొన్ని రకాల వాటిపై ఆంక్షలను సడలించారు. సర్వర్లను కూడా ఇకపై దిగుమతి చేసుకోవడానికి వీల్లేదు. మైక్రో కంప్యూటర్లు, ట్యాబ్స్, డాటా ప్రాసిసింగ్ మెషిన్స్‌పై ఆంక్షలు ఉంటాయి. అయితే సరైన లైసెన్సులు ఉంటే విదేశాల నుంచి వ్యక్తిగతంగా తెచ్చుకునేందుకు వీలుంటుంది. అయితే సంబంధిత కస్టమ్స్ సుంకాలు , ఇతరత్రా ఛార్జీలు వర్తింపచేస్తారు. దీనిని వ్యక్తిగతంగా వాడుకుని తరువాత ధ్వంసం చేయడం లేదా, తిరిగి ఎగుమతి చేయడం చేయాల్సి ఉంటుంది. కొన్ని రకాల కంప్యూటర్లను ఇ కామర్స్ పోర్టల్స్ ద్వారాలేదా, పోస్టు లేదా కొరియర్స్ ద్వారా తెప్పించుకోవచ్చు.

చైనా నుంచే 65 శాతం దిగుమతులు
థింక్‌ట్యాంక్ సంస్థ గ్లోబల్ ట్రేడ్ రిసర్చ్ ఇన్షియేటివ్ (జిటిఆర్‌ఐ) నివేదిక ప్రకారం చైనా నుంచే ఎక్కువగా కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌లు దిగుమతి అవుతున్నాయి. చైనాకు ఇండియానే వీటి విషయంలో అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. చైనా నుంచి ఇండియాకు దిగుమతి అవుతున్న సరుకులలో 65 శాతం వరకూ ఎలక్ట్రానిక్స్ వస్తువులు, మెషినరీ, ఆర్గానిక్ కెమికల్స్ ఉంటున్నాయి. ఇండియాలో వాడకం తీరు చూస్తే ఇక్కడ మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, సోలార్ సెల్‌మాడ్యూల్స్, ఐసిల కోసం అనివార్యంగా చైనా వైపు చూడాల్సి వస్తోంది. దేశంలో ఇటువంటి ఉత్పత్తులకు పారిశ్రామికవేత్తలు సిద్ధం అయి ఉన్నా, పలు సంస్థలు సరైన డిమాండ్‌లేని దుస్థితిలో పడ్డాయి.

దీనిని గుర్తించి ఇప్పుడు దేశీయ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని నోటిఫికేషన్‌లో తెలిపారు. ఇండియాలో హెచ్‌సిఎల్, సామ్‌సంగ్, డెల్, ఎల్‌జి ఎలక్ట్రానిక్స్, ఏసర్, యాపిల్, లినోవో, హెచ్‌పి వంటి ఎలక్ట్రానిక్ బ్రాండ్స్ అమ్ముతున్నారు. ఓ అంచనా ప్రకారం 202223లో భారతదేశం దిగుమతి చేసుకున్న పర్యనల్ కంప్యూటర్లు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు 5.33 బిలియన్ల డాలర్ల విలువ మేర దిగుమతి అయ్యాయి. అంతకు ముందు 202122లో ఈ విలువ 7.37 బిలియన్ డాలర్లుగా ఉండేది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News