హైదరాబాద్ : వ్యవసాయరంగంలో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుభీమా పధకం కోసం కొత్తగా వచ్చిన ధరఖాస్తులను అప్‌లోడ్ చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయం నుంచి ఆధికారులతో వీడియాకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాన్నారు. పచ్చిరొట్టె ఎరువులకు ఉపయోగపడే పైర్లను సాగు చేయించాలని ఈ దిశగా రైతాంగాన్ని మరింత చైతన్యం చేయాలని సూచించారు.పంటల సాగు వివరాలు వెంటనే తెలియజేయాలన్నారు. వరి, కంది, పంటలు ఈ నెలాఖరు వరకు, మిరప సెప్టెంబరు మొదటి వారం వరకు సాగు చేసుకోవడానికి అవకాశం ఉన్నదని మంత్రి వెల్లడించారు. ఈ సీజన్ కు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 83 లక్షల ఎకరాలలో వ్యవసాయ పంటలు, 7.50 లక్షల ఎకరాలలో ఉద్యాన పంటలు సాగయ్యాయని వెల్లడించారు.
రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలతో వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. రైతులకు లాభదాయకంగా ఉండే ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలన్నారు. ఇచ్చిన లక్ష్యం మేరకు వెంటనే మొక్కలు నాటించాలని మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులకు సూచించారు.
వ్యవసాయ శాఖా మంత్రి పేషీ నుండి అన్ని జిల్లాల డీఎఓ, డీహెచ్ ఎస్‌ఓ, ఇతర అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితోపాటు వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమీషనర్ హన్మంతు కొండిబ, అగ్రోస్ ఎండీ రాములు, ఏడీడీ విజయ్ కుమార్ , ఉద్యానశాఖ జేడీ సరోజిని తదితరులు పాల్గొన్నారు.