వాషింగ్టన్ : తనకే పాపం తెలియదని, 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాల తారుమారుకు యత్నించాననే వాదన సరికాదని అమెరికా మాజీ అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. తనపై వెలువడిన అభియోగాలకు ఆయన సమాధానం ఇచ్చారు. వాషింగ్టన్ డౌన్‌టౌన్‌లోని ఫెడరల్ కోర్టుహౌస్‌కు ట్రంప్ ఈ కేసుకు సంబంధించి గురువారం హాజరయ్యారు. ఇండో అమెరికన్ జడ్జి మోక్సిలా ఉపాధ్యాయ ముందు ట్రంప్ తమ వాదన విన్పించారు. న్యూజెర్సీలోని బెడ్‌మినిస్టర్ నుంచి ఆయన రోడ్డుమార్గం ద్వారా తమ కాన్వాయ్‌తో ఇక్కడికి వచ్చారు. వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో
ట్రంప్ అభ్యర్ధిత్వం ఖరారుకు ఇప్పుడు ఆయనపై దాఖలు అయి ఉన్న పలు క్రిమినల్ స్థాయి నేరాభియోగాలు అగ్నిపరీక్షలు అయ్యాయి. వీటినుంచి గట్టెక్కితేనే ఆయన రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిగా ముందుకు సాగి, ప్రెసిడెంట్ ఎన్నికలలో నిలిచేందుకు వీలేర్పడుతుంది. ఏమి చెప్పదల్చుకున్నారని ఒక్కముక్కలో చెప్పాలని న్యాయమూర్తి సూచించడంతో ట్రంప్ నాట్‌గిల్టీ అని తెలియచేసుకున్నారు. దీనితో ఇప్పటికి ఆయనకు విముక్తి కల్పిస్తున్నట్లు, అయితే ఎప్పుడు పిలిస్తే అప్పుడు కోర్టుకు రావాల్సి ఉంటుందని తెలిపిన న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు.