మండలిలో గంగుల భావోద్వేగ ప్రసంగం
అభినందించిన సహచర మంత్రులు, సభ్యులు
హైదరాబాద్ : వచ్చే ప్రభుత్వం కెసిఆర్‌దే.. ప్రతీ పథకం కొనసాగేదేనని మంత్రి కమలాకర్ అన్నారు. శాసనమండలిలో సంక్షేమంపై శుక్రవారం నిర్వహించిన స్వల్పకాల చర్చలో ఆయన తనదైన శైలిలో ప్రసంగించారు, ‘తెలంగాణకు ముందు, తర్వాత గణాంకాలతో సహా బిసిల సంక్షేమం, అభివృద్దిలో ప్రభుత్వాలు అనుసరించిన వైఖరిని వివరించిన తీరుకు యావత్ సభతో పాటు తెలంగాణ సమాజం ముక్త కంఠంతో ఏకీభవించింది. సృష్టి మెదలైనప్పటి నుండి ఉన్న బిసి కుల వృత్తిదారులు అప్పటినుండి స్వాతంత్య్రం సిద్దించిన డ్బ్బై ఏళ్లవరకూ ఎలా వెనుకకు నెట్టేయబడ్డారో, సమాజంలో ఎంత వేదన అనుభవించారో సోదహారణంగా వివరిస్తుంటే యావత్ సభ పిన్ డ్రాప్ సైలెన్స్ తో అలకించింది.
నాడు బొంబాయి, బొగ్గుబాయి, బీవండి వలసల జీవితాలను తలచుకొని తన కన్ను చెమ్మగిలుతుంటే చూస్తున్న ప్రతీ కంట్లో అప్రయత్నంగా నీళ్లు ఉబికి వచ్చాయి, కాస్త అప్పో సప్పో చేసి బతుకుదామని దుబాయి, కువైట్లకు పోయిన తెలంగాణ బిసి బిడ్డల వెతలను వివరిస్తుంటే భావ గంభీర వాతావరణంతో అవలోకించింది. బిడ్డ పెళ్లికోసం నాడు తన్లాడిన తల్లి యాతనతో ప్రతీ గుండె జతకలిసింది, సొంతకాళ్లపై నిలబడి బతకడానికి బ్యాంకుల లింకేజీలు పెట్టి తీసుకొచ్చిన తూతూ మంత్రపు పథకాల లోగుట్టులను విప్పుతూ బహుళజాతీ కంపెనీల కబంద హస్తాల్లో చిక్కి కులవృత్తులు అంతరించిపోతున్న ఆవేదన, ఆత్మగౌరవం కోసం రాజదానిగడ్డపై సభ నిర్వహించుకొని చీకటి పడితే ఎక్కడికి పోవాలో అనే అవేదన పడిన వెనుకబడిన వర్గాల వేదనను కళ్లకు కట్టింది. ఇలా ప్రతీ సమస్యకు నాటి ఉద్యమసారథి, నేటి ప్రగతి సారథి సిఎం కెసిఆర్ నేతృత్వంలో జరుగుతున్న పునరుజ్జీవనం తెలంగాణ వెనుకబడిన వర్గాలను సామాజికంగా, ఆర్థికంగా ఎలా పైకి తీసుకొస్తుందో సాధికారికం’గా మంత్రి గంగుల కమలాకర్ వివరించారు.
‘నాడు 8వేల మందికి అర్థాకలితో అరకొర వసతులతో 19 గురుకులాల్లో విద్యనందిస్తుంటే నేడు 327కు పెంచుకొని లక్షా 80వేల మందికి ప్రపంచస్థాయి విద్యను అందిస్తున్న ఆనందాన్ని కడుపేద కూలి తనింటికి వచ్చిన తర్వాత ఇంట్లో కూతురు ఇంగ్లీష్లో మాట్లాడుతున్న మురిపెంలో తన శ్రమను మరిచిపోయి సంతోషపడిన నవ్వులో కెసిఆర్ విరబూసాడంటూ చెప్తుంటే ఆ దృశ్యం కళ్లముందు కదలాడింది, ఆత్మగౌరవం కోసం అలమటించిన చోట 100 కోట్లకు ఎకరం పలుకుతున్న నేలమ్మను 87 ఎకరాలు కేటాయించి 41 కులాలకు తెచ్చిన గౌరవాన్ని, కులవృత్తులకు జీవం పోయడానికి లక్ష రూపాయల రుణాన్ని ఎలాంటి లింకేజీలు లేకుండా ఇచ్చిన తీరు, పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ హాస్టల్లు, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇస్తున్న రియింబర్స్‌మెంట్లు, కళ్యాణలక్ష్మీ పథకం, వీటితో పాటు బిసిలకు సింహబాగం అందిస్తున్న ఆసరా పించన్లు, రైతుబంధు, ఆర్టీసి విలీనం.. ఇలా ప్రతీ అంశంలో కెసిఆర్ సర్కార్ వెనుకబడిన వర్గాల సంక్షేమాభివృద్ధి కోసం ఎలా కృషి చేస్తుందో, ఇప్పటికే లక్ష కోట్లను ఎలా ఖర్చుబెట్టిందో’ మంత్రి గంగుల కమలాకర్ వివరించిన తీరు ఆధ్యంతం ఆకట్టుకుంది, అరగంట ప్రసంగం ఐదు నిమిషాల్లో ముగిసినట్టుగా, నెర్రెలుతేలిన నేలలో విరుజల్లు కురిసినట్టుగా, భగభగ మండే ఆకాశంలో ఇంద్రధనస్సు విరిసినట్టుగా చివరకు తేనేలూరే చక్కెర నోట్టోపోసినట్టు వచ్చే ప్రభుత్వం కెసిఆర్‌దే ప్రతీ పథకం కొనసాగేదే అని చెప్పిన మాట ప్రతీ తెలంగాణ బిడ్డకు సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది నేటి మంత్రి గంగుల కమలాకర్ ప్రసంగం.